CM YS Jagan: మీ చిరునవ్వే ఆక్సిజన్‌ | CM YS Jagan On Navaratnalu Welfare Schemes Implementation | Sakshi
Sakshi News home page

CM YS Jagan: మీ చిరునవ్వే ఆక్సిజన్‌

Published Wed, Jul 20 2022 3:24 AM | Last Updated on Wed, Jul 20 2022 1:45 PM

CM YS Jagan On Navaratnalu Welfare Schemes Implementation - Sakshi

అధికారం అంటే ప్రజలపై అజమాయిషీ కాదు.. మమకారమని రుజువు చేసి చూపించాం. గత సర్కారు పథకాలను ఎలా ఎగ్గొట్టాలని చూస్తే ఇప్పుడు సంతృప్త స్థాయిలో అర్హులందరికీ అందజేస్తున్నాం. పేదలను వెతుక్కుంటూ వెళ్లి వారి గడప తడుతున్నాయి. మన పాలనలో మనసు ఉంది.. గత పాలనలో అది లేదు. ఆ మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపలో కనిపిస్తున్న ప్రజల చిరునవ్వే ప్రభుత్వానికి ఆక్సిజన్‌ లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలండర్‌ ప్రకటించి అమలు చేస్తూ నవరత్నాల హామీలకు కట్టుబడి పరిపాలన కొనసాగుతోందన్నారు. ప్రజలు సంతోషంగా చెబుతున్న మాటలే ప్రభుత్వానికి నమ్మకాన్ని కలిగించి అడుగులు వేయిస్తున్నాయని తెలిపారు. విప్లవాత్మక మార్పులు తెచ్చి మంచి చేయగలిగాం కాబట్టే మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నామన్నారు. పలు పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో మిగిలిపోయిన 3,39,096 మంది లబ్ధిదారుల ఖాతాలకు సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.137 కోట్లను నేరుగా జమ చేశారు.

ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి అర్హత కలిగి మిగిలిపోయిన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. కొత్తగా 2,99,085 మందికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డులు, (కొత్త సామాజిక పెన్షన్లకు ఏటా రూ.935 కోట్ల అదనపు వ్యయం), 7,051 మందికి బియ్యం కార్డులు (1,45, 47,036కి చేరిన బియ్యం కార్డులు), 3,035 మందికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల (1,41,12,752కి పెరిగిన ఆరోగ్యశ్రీ కార్డులు) జారీని సీఎం ప్రారంభించి మాట్లాడారు. వివరాలివీ..
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక చెక్కును విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

అర్హులు మిస్‌ కారాదనే తపనతో..
అర్హత ఉంటే ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు. మన ప్రభుత్వం పడుతున్న తపనకు ఈ కార్యక్రమం నిదర్శనం. గతంలో వివిధ కారణాల వల్ల పలు పథకాలను అందుకోలేకపోయిన దాదాపు 3.40 లక్షల మంది అర్హులందరికీ ఇవాళ రూ.137 కోట్లను నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. కొత్తగా పెన్షన్‌ కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ దాదాపు మరో 3.10 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నాం. అదనపు కార్డులు ఇవ్వడం వల్ల ఏటా మరో రూ.935 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నా అర్హత కలిగిన ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదన్న లక్ష్యంతో అందిస్తున్నాం. 

ఏటా రెండు దఫాలు..
ఇవన్నీ బాధ్యతతో, పేదల మీద ఉన్న మమకారంతో చేస్తున్నాం. ఇక్కడ కులం, మతం, వర్గం, రాజకీయాలు చూడటం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయకపోయినా సరే అర్హులైతే మేలు చేస్తున్నాం. కేవలం అర్హత ఒక్కటే ప్రాతిపదికగా నవరత్నాల పాలన అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాం. అర్హులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వారికి మళ్లీ అవకాశమిచ్చి మరోసారి గుర్తించే కార్యక్రమం చేపట్టాం. అర్హత ఉండీ ఏ కారణంతోనైనా పథకాలు అందని వారికి ఏటా రెండు దఫాలుగా జూలైలో ఒకసారి, డిసెంబరులో మరోసారి పథకాల ప్రయోజనాలను ప్రత్యేకంగా అందచేస్తున్నాం.

గత డిసెంబరులో...
గత డిసెంబరు 28 తేదీన వివిధ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన 9,30,809 మంది అర్హులకు మేలు చేస్తూ రూ.703 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇవాళ 3.40 లక్షల మందికి మంచి చేస్తూ రూ.137 కోట్లు జమ చేస్తున్నాం.

నాడు.. ఎలా ఎగ్గొట్టాలనే 
మన ప్రభుత్వం అర్హులు ఎంతమంది ఉన్నా సరే శాచ్యురేషన్‌ (సంతృప్త స్థాయి) పద్ధతిలో పథకాలను అందచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మందికి రకరకాల కారణాలతో ఎగ్గొట్టిన పరిస్థితి. పార్టీలవారీగా, కులాలవారీగా ఎలా కత్తిరించాలి? ఎలా ఎగ్గొట్టాలి? అన్నదే గత సర్కారు విధానం. ఫలానా వారు తమకు వ్యతిరేకమని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని, గ్రామాలలో ఇంతమందికే కోటా అని సాధ్యమైనంత ఎక్కువ మందికి గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొట్టారు. మరోవైపు నాడు ఇన్ని పథకాలూ లేవు.

ఇచ్చే అరకొర పథకాల్లో కూడా కత్తిరింపులు. వారు ఇచ్చే రూ.వెయ్యికి ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పని అయ్యేది కాదు. లంచాలు ఇవ్వనిదే పని అయ్యేది కాదు. లంచాలు ఇచ్చేటప్పుడు కూడా ముందు మీరు ఏ పార్టీకి చెందిన వారని ప్రశ్నించేవారు. పథకాలు, పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కూడా చూశాం.

సామాజిక తనిఖీలతో పారదర్శకంగా
ఇవాళ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలు చేసేందుకు సామాజిక తనిఖీ చేపట్టి గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శిస్తున్నాం. పక్షపాతం లేకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా అర్హులను ఎంపిక చేస్తున్నాం. రేషన్‌ కార్డులు, పెన్షన్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య గమనిస్తే గతంలో కంటే లక్షల్లో ఎక్కువగా ఉన్నారు. ఎక్కడా దళారులు, మధ్యవర్తులు లేరు. ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టే విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 

గడప వద్దే ప్రభుత్వ సేవలు..
వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే డబ్బులను బ్యాంకులు తీసుకోలేని రీతిలో అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నాం. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో ముందుగానే సంక్షేమ క్యాలండర్‌లో ప్రకటించి ఆ ప్రకారం అమలు చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలు వారి ఇంటి తలుపు తడుతున్నాయి. అప్పటికి, ఇప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గొప్ప మార్పులకు శ్రీకారం కాదా?

ప్రతి అక్కనూ పలుకరిస్తూ..
ఇలా మంచి చేయగలిగాం కాబట్టే మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికీ అడుగులు వేయగలుగుతున్నాం. తలుపు తట్టి ప్రతి అక్కనూ పలుకరిస్తూ ఈ మూడేళ్లలో ఇంత మంచి జరిగిందని వివరించగలుగుతున్నాం. అవును జరిగింది.. అని వాళ్లు చెప్పే మాటలే మన ప్రభుత్వానికి ఆక్సిజన్‌. బాగా చేశారు అని వారు చిరునవ్వుతో సంతోషంగా చెబుతున్న మాటలే.. మనల్ని వెన్ను తట్టి మన ప్రభుత్వానికి నమ్మకం ఇచ్చి అడుగులు ముందుకు వేయించగలుగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారికి నిబద్ధత, విశ్వసనీయత ఉండాలి. దేవుడి దయ వల్ల ఇవాళ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్‌ సమీర్‌శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు పాల్గొన్నారు.

3.40 లక్షల మంది అర్హులకు మేలు
ఈబీసీ నేస్తం 6,965 మందికి, జగనన్న చేదోడు 15,215 మందికి, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా 16,277 మందికి, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ 49,481 మందికి, జగనన్న విద్యాదీవెన 17,150 మందికి, జగనన్న వసతి దీవెన 25,644 మందికి, వైఎస్సార్‌ సున్నావడ్డీ (మహిళలు అర్బన్‌) 2,04,891 మందికి, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు ఖరీఫ్‌ 2020లో 1,233 మందికి, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2019 – 20లో 713 మందికి, వైఎస్సార్‌ కాపునేస్తం 1,249 మందికి, వైఎస్సార్‌ వాహనమిత్ర 236 మందికి, వైఎస్సార్‌ నేతన్న నేస్తం 42 మందికి.. మొత్తంగా వివిధ కారణాల వల్ల ఈ పథకాలకు అర్హత ఉండి కూడా అందుకోలేకపోయిన 3.40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాం. ఈ 12 పథకాలతో పాటు కొత్తగా మరో 2,99,085 మందికి పెన్షన్‌ కార్డులు, 7,051 మందికి బియ్యం కార్డులు, 3,035 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసి అర్హుల చేతికి నేరుగా అందిస్తున్నాం.

ప్రతి ఇంట్లోనూ ఆనందం..
సీఎం జగన్‌ పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలను క్యాలెండర్‌ ప్రకారం అమలు చేయడంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల మిగిలిపోయిన వారికీ ఆయా పథకాలు అందచేస్తున్న ప్రభుత్వం ఇది. మా మనవడు జగన్‌ వల్లే గొప్పగా బతుకుతున్నామని గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి అవ్వా తాత చెబుతున్నారు. లంచం లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చడం పట్ల ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. మళ్లీ మీరే సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు.
    – మంత్రి బూడి ముత్యాలనాయుడు

పెద్ద మనసుకు నిదర్శనం
టీడీపీ హయాంలో ఏ పథకం మొదలుపెట్టినా ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఎప్పుడు ఆగిపోతుందో అంతుబట్టదు. రుణమాఫీ హామీని నీరుగార్చారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ ముందుకెళుతున్నారు. మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లకుపైగా పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి దేశంలో ఆదర్శంగా నిలిచారు. సాంకేతిక కారణాలతో పథకాలు అందని అర్హులకు కూడా ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచన ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.
    – మంత్రి ఆదిమూలపు సురేష్‌

గతంలో ఎవరూ ఆలోచించలేదు..
ఈబీసీ నేస్తం పథకం చాలా గొప్ప ఆలోచన. గతంలో ఏ సీఎం మా గురించి ఇలా ఆలోచించలేదు. పథకం కోసం డిసెంబర్‌లో దరఖాస్తు చేసుకుంటే కొన్ని కారణాలతో రాలేదు. ఈ ఏడాదీ రాదనుకున్నా.. కానీ వచ్చింది. మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల అందరికీ లబ్ధి చేకూరుతోంది. నా పిల్లలను చక్కగా చదివించుకుంటున్నా. ప్రతి పేదవాడు ఆనందంగా, సంతోషంగా ఉండాలని మీరు ఎంతో చేస్తున్నారు.
    – లక్ష్మి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, శ్రీకాకుళం

ఓసీలకూ మేలు చేస్తున్నారు
జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందాయి. ఈ డబ్బుతో వ్యాపారాన్ని  అభివృద్ధి చేసుకున్నా. పొదుపు సంఘంలో సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా లబ్ధి పొందా. గతంలో íపింఛన్‌ కోసం క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వలంటీర్‌ తెల్లవారుజామునే వచ్చి పింఛన్‌ ఇస్తున్నాడు. ఓసీలకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిన మొదటి ముఖ్యమంత్రి మీరే. 
    – జ్యోతి, జగనన్న చేదోడు లబ్ధిదారురాలు, అనంతపురం జిల్లా

మీవల్లే ఇంగ్లిష్‌ మీడియం చదువులు
పాాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకార భరోసా ఇస్తున్నారు. గతంలో రూ.4 వేలు మాత్రమే అందగా మా బాధలను గుర్తించి మీరు ఇప్పుడు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. గత రెండేళ్లుగా అందింది. ఈ ఏడాది నా అకౌంట్‌ సరిగా లేకపోవడం వల్ల రాలేదు. గ్రామ సచివాలయానికి వెళ్లి నాకు రాలేదని చెప్పగానే వెంటనే సరిచేశారు. మత్స్యకారుల పిల్లలు మీవల్లే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు.     
– సైమన్,     మత్స్యకార భరోసా లబ్ధిదారుడు, కాకినాడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement