ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి

CM YS Jagan Mohan Reddy Writes Letter To PM Narendra Modi For Vaccines - Sakshi

ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరిన ముఖ్యమంత్రి జగన్‌

భారీగా టీకాలిచ్చే సామర్థ్యం ప్రైవేట్‌ ఆస్పత్రులకు లేదు

ఆ వ్యాక్సిన్లు మాకిస్తే రికార్డుస్థాయిలో టీకాలిస్తాం 

ఆంధ్రప్రదేశ్‌ సామర్థ్యం ఇప్పటికే నిరూపితమైంది

సాక్షి, అమరావతి: ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకోలేని కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ప్రైవేట్‌ ఆస్పత్రులకు లేనందున వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించి టీకాల కార్యక్రమం వేగవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. తగినన్ని వ్యాక్సిన్లు కేటాయిస్తే రికార్డు స్థాయిలో టీకాలిచ్చే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఇప్పటికే నిరూపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ...

సరైన నిర్ణయం..
కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. దేశంలో అర్హులైన వారందరికీ జూన్‌ 21 నుంచి అమలు చేస్తున్న టీకాల కార్యక్రమానికి తగినన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకుంది. సర్వత్రా అభినందనలు అందుకుంటున్న ఈ నిర్ణయంతో వ్యాక్సినేషన్‌ సజావుగా సాగుతుంది. 

ఏపీలో విస్తృత వ్యవస్థ..
భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం మా రాష్ట్రానికి ఉందని ఇప్పటికే నిరూపించాం. జూన్‌ 20న ఒక్కరోజే 13,72,481 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా మా వ్యవస్థాగత సామర్థ్యాన్ని చాటిచెప్పాం. ఏప్రిల్‌ 14న 6,32,7890 మందికి, మే 27న 5,79,161 మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లు, 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేలకుపైగా ఏఎన్‌ఎంలు ఉండటంతోపాటు భారీ సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇంతటి విస్తృతమైన వ్యవస్థ సహకారం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీ పరిమాణంలో వ్యాక్సిన్లు సరఫరా చేస్తే ఇదే రీతిలో టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించగలం.

రాష్ట్రాలకు ఇస్తే వేగవంతం...
మే 1 నుంచి అమలు చేసిన సరళీకృత జాతీయ కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ విధానం ప్రకారం దేశంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలకు టీకాలు సరఫరా చేశారు. ప్రైవేట్‌ సంస్థలకు 25 శాతం వ్యాక్సిన్లు సరఫరా చేసే విధానాన్ని జూన్‌ 21 నుంచి అమలు చేస్తున్న జాతీయ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కూడా పొందుపరిచారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 2,67,075 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేయగలిగారు. అయినప్పటికీ మా రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు జూలై కోసం 17,71,580 డోసుల వ్యాక్సిన్లు కేటాయించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్‌గానీ ఆ ఆసుపత్రుల గత అనుభవాన్నిగానీ పరిశీలిస్తే అంత భారీ పరిమాణంలో వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోలేవన్నది స్పష్టమవుతోంది.

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి జూన్‌ 24న నిర్వహించిన సమావేశంలో కూడా పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్‌  నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా టీకాలు వేసేందుకు అనుమతించాలని కోరుతున్నా. దీనివల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవడమే కాకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుంది. అటువంటి నిర్ణయానికి విస్తృత ప్రజామోదం లభించడంతోపాటు మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.  ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top