ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదు: సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Review Meeting On Housing Scheme - Sakshi

సాక్షి, తాడేపల్లి : జూన్‌ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు. స్టీల్, సిమెంట్‌..ఇతర మెటీరియల్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు. బుధవారం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పనులు ఆగకూడదు:
జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్‌ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి లేఅవుట్‌లో మోడల్‌ హౌజ్‌ తప్పని సరి :
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌజ్‌ నిర్మించాలి.  ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదిక కూడా తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు.. వంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి.

స్టీల్‌ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి :
కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్‌ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్‌ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ కావాలి. కాబట్టి స్టీల్‌ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్‌ తప్పనిసరిగా అందించాలి. 

అన్ని వసతులు ఉండాలి :
కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలి. అలాగే లేఅవుట్‌ కూడా పక్కాగా ఉండాలి. సీసీ రోడ్డు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జెజెఎం), విద్యుద్దీకరణ, ఇంటర్నెట్‌.. మౌలిక వసతుల్లో ముఖ్య కాంపోనెంట్స్‌. కరెంటు, నీటి సరఫరాతో పాటు, రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు.

ఆర్థిక వృద్ధి కాబట్టి..:
కోవిడ్‌ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది. ఎందుకంటే కార్మికులకు పని దొరుకుతుంది. అలాగే స్టీల్, సిమెంట్, ఇతర మెటేరియల్‌ కొనుగోలు వల్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. కాబట్టి దీనికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. 

భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థదే :
భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థదే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైప్‌లైన్లు, విద్యుత్‌ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. అయితే ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి.

అన్ని పనులు ఒకే ఏజెన్సీకి:
జగనన్న కాలనీ లేఅవుట్లలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, భూగర్భ ఇంటర్నెట్, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పనులు. అయితే ఇవన్నీ వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒకే ఏజెన్సీకి అన్ని పనులు అప్పగించాలి. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించండి. పనుల్లో డూప్లికేషన్‌ ఉండకూడదు, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించండి

అదనపు ఫండింగ్‌ కోసం..:
ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్‌ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top