అనుక్షణం అప్రమత్తం

CM YS Jagan Mandate To Officials About Mystery Illness In Eluru - Sakshi

అంతుచిక్కని అనారోగ్యంపై వైద్యాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత కొద్ది రోజులుగా ఏలూరు పరిసరాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలపై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అంతుచిక్కని అనారోగ్యంతో ఆకస్మికంగా అస్వస్థతకు గురై ఏలూరులోని ఆసుపత్రిలో చేరిన బాధితులను సీఎం జగన్‌ సోమవారం పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రికి చేరుకుని నేరుగా బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనారోగ్యం ఎలా వచ్చింది? ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? అని ఆరా తీశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారికి ఏ మందులు ఇస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. 

సాధారణ స్థాయిలోనే భార లోహాలు..
అంతుబట్టని అనారోగ్యం కేసులు ఎప్పుడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న విషయాలను సీఎం జగన్‌ ఆరా తీశారు. నాలుగో తేదీన నాలుగైదు కేసులు వచ్చాయని, ఐదో తేదీ సాయంత్రం నుంచి కేసులు పెరిగిపోయాయని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు వివరించారు. ఇప్పటి వరకూ 340 కేసులు వెలుగులోకి రాగా 168 మంది డిశ్చార్జి అయ్యారని, 14 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపించామని వివరించారు. డిశ్చార్జి అయిన వారిలో ముగ్గురు మళ్లీ అదే లక్షణాలతో తిరిగి వచ్చారని చెప్పారు. కళ్లు తిరిగి పడిపోవడం, ఫిట్స్, నీరసం, అయోమయంగా ఉండటం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల గురించి సీఎం వాకబు చేశారు. ఏ పరీక్షలు నిర్వహించారు? ఫలితాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. తాగునీటిìకి సంబంధించి అన్ని పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. అందులో భార లోహాలు (హెవీ మెటల్స్‌) ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో కూడా పరీక్షలు నిర్వహించామని అవి సాధారణ స్థాయిలోనే ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. 

రక్త పరీక్షల నివేదికకు మరికొంత సమయం..
వివిధ రోగాలకు కారణం అయ్యే అన్ని రకాల వైర‹స్‌ పరీక్షలు నిర్వహించామని, అవి కూడా నెగిటివ్‌ వచ్చాయని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు. బ్లడ్‌ కల్చర్‌ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. సీటీ స్కాన్‌ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయన్నారు. అస్వస్థతకు కారణాలు ఇంకా నిర్దిష్టంగా తెలియలేదని చెప్పారు. నీటితో పాటు పాలు కూడా పరీక్షించామని, అవి బాగానే ఉన్నాయన్నారు. అనుమానం ఉన్న అన్ని రకాల పరీక్షలు చేశామని, అయితే ఏ జాడ తెలియలేదన్నారు. ఏలూరు అర్బన్‌ ప్రాంతంలోనే కాకుండా రూరల్, దెందులూరు పరిధిలో కూడా కేసులు గుర్తించామని చెప్పారు. అనారోగ్యానికి గురైన వారిలో అన్ని వయసుల వారు ఉన్నారని ముఖ్యమంత్రికి వివరించారు. మున్సిపల్‌ వాటర్‌ తాగేవారితో పాటు నీళ్లు వేడి చేసుకుని తాగేవారూ అస్వస్థతకు గురవుతున్నారని, మినరల్‌ వాటర్‌ తాగేవారు కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు శాంపిల్స్‌ పంపించామని, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషియన్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ బృందాలతోపాటు ఐసీఎంఆర్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, డబ్ల్యూహెచ్‌వో బృందాలు కూడా వస్తున్నాయని, అవి పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చని పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పేర్ని నాని, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

ఎలాంటి ఇబ్బంది ఉన్నా కాల్‌ 104, 108
ప్రత్యేక బృందాలు వచ్చాక వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఏలూరులోనే అందుబాటులో ఉండాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా 104, 108 నంబర్లకు కాల్‌ చేసేలా అవగాహన కల్పించాలని, కాల్‌ అందిన వెంటనే  వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిశ్చార్జి అయిన వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచి పౌష్టికాహారం, మందులు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top