గిరిజనుల్లో విద్యా కాంతులు | CM YS Jagan Comments at foundation stone of Central Tribal University | Sakshi
Sakshi News home page

గిరిజనుల్లో విద్యా కాంతులు

Aug 26 2023 3:08 AM | Updated on Aug 26 2023 3:38 AM

CM YS Jagan Comments at foundation stone of Central Tribal University - Sakshi

వర్సిటీ భవనాల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌ తదితరులు

గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా  చినమేడపల్లికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకా­రం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్‌ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం 
► ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం.  

► తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం.  

► గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ అనే కాన్సెప్ట్‌ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్‌ విధానంతో వారి టెక్టŠస్‌ బుక్స్‌నూ మార్చగలిగాం.  

► ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్‌ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం.  

► మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్‌ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే.  

రాజకీయంగానూ పెద్దపీట  
► నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులకు రాజకీయ పదవులిచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్‌ పదవి, ఏ నామినేటెడ్‌ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. మొట్టమొదట గిరిజన చెల్లెమ్మకు, తర్వాత గిరిజన అన్నకు కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా.. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీని కూడా నియమించాం.  

► నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిíÙగా వారికి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాల ప్రయోజనం కోసం రూ.410 కోట్లు ఖర్చు చేశాం.   

ఆరోగ్య పరిరక్షణలోనూ శ్రద్ధ 
► గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతుల వరకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీమ్‌లతో వారు తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగాం. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కార్యక్రమం అమలు జరుగుతోంది. 

ప్రతి అడుగూ గిరిజనుల బాగు కోసమే  
► గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. 1,53,820 కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్‌ఆర్‌ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఏకంగా 84 శాతం కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 497 సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ముళ్లూ, చెల్లెమ్మలే. 

► నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్‌ నొక్కుతుంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నాలుగేళ్ల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం. నాన్‌ డీబీటీ అంటే ట్యాబ్‌లు, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు మరో రూ.5,257 కోట్ల మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్‌ డీబీటీ కలుపుకుంటే 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్ల లబ్ధి చేకూరింది.   

► సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వల్ల గొప్ప మార్పు జరగబోతోంది. దీన్ని మన ప్రాంతానికి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement