పీఆర్సీపై  పది రోజుల్లో ప్రకటన: సీఎం వైఎస్‌ జగన్‌ హామీ

CM Jagan Tirupati Visit: Key Announcement On PRC - Sakshi

సాక్షి, తిరుపతి/సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారం పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్, శ్రీకృష్ణానగర్‌లో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు విన్నవించుకుంటుండగా.. జనం మధ్యలో నుంచి కొందరు ఉద్యోగులు ‘పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు సార్‌..’ అంటూ అరిచారు.

ఆ మాటలు విన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ‘ఇక్కడ ఎవరో పీఆర్సీ అని అడుగుతున్నారు.. మీరు కూడా ముందుకు రండి చెబుతాను’ అని పిలిచారు. జనంలో నుంచి కొందరు ఉద్యోగులు ముందుకు వచ్చారు. ‘పీఆర్సీ విషయమే కదా.. వారం పది రోజుల్లో ప్రకటన చేస్తా. సరేనా?’ అని వారికి సమాధానం ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీతో వారు సంతోషంతో చప్పట్లు చరుస్తూ.. ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు.  

పీఆర్సీ, ఇతర అంశాలపై విస్తృత చర్చ
ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలకు సంబంధించి శుక్రవారం సచివాలయంలో కార్యదర్శుల స్థాయి సంప్రదింపుల కమిటీ ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఉద్యోగ సంఘాల నుంచి ఈ కమిటీ పలు సూచనలు, సలహాలు తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా పీఆర్సీ ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (సర్వీసెస్‌–హెచ్‌ఆర్‌ఎం) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి డా.కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్‌ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.  

సీఎం ప్రకటనపై పూర్తి విశ్వాసం ఉంది  
వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేస్తామన్న సీఎం ప్రకటనపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే సీఎం మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కార్యదర్శుల కమిటీ సమావేశంలో అధికారులు ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వాటిని సీఎంతో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారు. డిసెంబర్‌ 10వ తేదీలోగా పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మిగతా సమస్యలపై కూడా పోరాడతాం. – వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి
సీఎం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. పీఆర్సీ నివేదిక ఇచ్చినప్పుడే అధికారులతో చర్చలు సఫలీకృతమవుతాయి. ప్రస్తుత సమావేశం తీరు ఉద్యోగులను అవమానించేలా, పీఆర్సీపై కాలయాపన, కంటితుడుపుగానే ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం. అయితే ఇదే సమయంలో ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టకూడదు. పీఆర్సీతో పాటు ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను కూడా పరిష్కరించాలి. మాతో చర్చిస్తున్న అధికారులకు పీఆర్సీ నివేదికపై అవగాహన లేదు. ప్రభుత్వం నుంచి ఈ సమావేశంలో ఎటువంటి స్పందన లేదు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగిస్తాం.  కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఇవ్వకుండా పీఆర్సీపై అభిప్రాయాలు చెప్పాలనడం సరికాదు. – బండి శ్రీనివాసరావు.. ఏపీ జేఏసీ చైర్మన్‌ , 
బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌,
కేఆర్‌ సూర్యనారాయణ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

చదవండి: (CM YS Jagan: బాధితులకు బాసట)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top