దేవుడి దయతో మంచిరోజులొచ్చాయ్‌: సీఎం జగన్‌

Cm Jagan Speech On Kadapa Steel Plant Bhumi Pooja Program - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని సీఎం పేర్కొన్నారు.

దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్‌ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

‘‘రూ.700 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తవుతుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో చుట్టుపక్క అనుబంధాల రంగాలు అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి లభిస్తుంది. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.
చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top