చదువులకు ఊతమిచ్చేలా కల్యాణమస్తు | Sakshi
Sakshi News home page

చదువులకు ఊతమిచ్చేలా కల్యాణమస్తు

Published Wed, Feb 21 2024 5:35 AM

CM Jagan Release YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa Funds - Sakshi

సాక్షి, అమరావతి :  పిల్లలను చదివించే దిశగా ఒక అడుగు ముందుకేసి వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్‌–డిసెంబర్‌ 2023 (త్రైమాసికం)లో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు ఈ పథకం కింద రూ.78.53 కోట్ల ఆరి్థక సాయాన్ని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు.

దీనివల్ల ఈ పథకానికి అర్హత రావాలంటే, ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి కాబట్టి పిల్లలను చదివించడానికి ప్రోత్సాహం అందించేదిగా ఉంటుందన్నారు. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలన్న నిబంధన వల్ల పది పాసయ్యాక ఇంటర్‌లో చేరుస్తారని చెప్పారు. పైగా ఇంటర్‌ చదువుకు అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నాం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారన్నారు. ఇంటర్‌ పూర్తైన తర్వాత విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పిల్లల బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం ఉన్నందున డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల వైపు అడుగులు పడతాయని అన్నారు.

ఇలా చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి అమ్మాయి, అబ్బాయి గ్రాడ్యుయేట్స్‌ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని తెలిపారు. ‘కుటుంబంలో తల్లి చదువుకుని ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చే పిల్లలు ఆటోమేటిక్‌గా చదువుల బాట పడతారు. భవిష్యత్‌లో కుటుంబాల తల రాతలు మారాలన్నా, మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలన్నా, మంచి చదువులు మన చేతుల్లో ఉండాలి. అప్పుడు మన తల రాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంద’ని చెప్పారు. అందువల్ల గత ప్రభుత్వ హయాంలో వలె ఈ పథకాన్ని ఏదో నామ్‌కే వాస్తేగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా.. ప్రతి త్రైమాసికం (క్వార్టర్‌) పూర్తయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్‌ చేసి తర్వాత ఇస్తున్నామని తెలిపారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు 
► సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో సర్టీ ఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేలా మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఏ ఒక్కరూ మిస్‌ కా­కుండా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పిం­చేలా సచివాలయం వరకూ తీసుకుపోయాం. 

► గతం కంటే పెంచి మరీ సాయమందిస్తున్నాం. గతంలో ఎస్సీలకు రూ.40 వేలకే పరిమితమైన పథకాన్ని రూ.లక్ష వరకు తీసుకుపోయాం. అదే కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల వరకూ పెంచాం. ఎస్టీలకు గతంలో రూ.50 మాత్రమే ఉంటే దాన్ని కూడా రూ.లక్ష వరకు పెంచడంతోపాటు, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలకు పెంచాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల నుంచి రూ.50 వేలకు, కులాంతర వివాహం అయితే రూ.75 వేలకు తీసుకుపోయాం. దివ్యాంగులకు అయితే ఏకంగా రూ.1.50 లక్షల వరకు  తీసుకెళ్లాం. వాళ్ల కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏ ఒక్కరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్‌ అమౌంట్‌ పెంచి ఇస్తున్నాం. చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 

► గతంలో అరకొరగా ఇచ్చిన పరిస్థితులు. దాదాపు 17,709 మంది పిల్లలకు అరకొరగా ఇచ్చేవి కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితి గతంలో ఉంది. ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదని అనే ఉద్దేశంతో త్రైమాసికం (క్వార్టర్‌) అయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఐదో విడత కార్యక్రమం. అక్టోబరు, నవంబరు, డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఈ ఒక్క పథకానికే ఇప్పటి వరకు 56,194 జంటలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ రూ.427 కోట్లు ఇచ్చాం.   

ఇది అందరూ గర్వించే పథకం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నత ఆశయంతో అమలు చేస్తున్న వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్‌ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో గౌరవప్రదంగా వివాహం నిర్వహించేలా భరోసా కల్పిస్తున్న పథకం. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్లు లేని కబోదుల్లా నోరు పారేసుకుంటున్నాయి. ఇటీవల  బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. కళ్యాణమస్తు పథకం చదువుకు లింక్‌ అవడంతో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గడం పట్ల ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ప్రశంసించారు.      – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 

పేదల పెళ్లికి పెద్ద భరోసా   
అన్నా.. మాది నిరుపేద కుటుంబం. మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఎస్సీని. పెళ్లి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అంటూ పేదల పెళ్లికి పెద్ద భరోసా ఇస్తున్నారు. అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్య వివాహాలు తగ్గుతున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మేం చాలా లబ్ధి పొందాం. నాడు–నేడుతో స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. పేదలకు ఇంగ్లిష్‌ చదువులు వచ్చాయి. పేదల ఇళ్లలో వెలుగులు 
నింపుతున్నారు. థ్యాంక్యూ జగన్‌ అన్నా.     – భార్గవి, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా 

Advertisement
 
Advertisement