ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్‌

CM Jagan Comments In A Review Of Health Sector On Aarogyasri And Nadu Nedu - Sakshi

ఆరోగ్య రంగంలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్‌

మండలానికి 2 పీహెచ్‌సీలు

ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు డాక్టర్లు  

ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలు

అప్పుడే అందరికీ అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ  

తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ రూపొందించాలి 

ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’కు రూ.16,270 కోట్ల వ్యయం  

యుద్ధ ప్రాతిపదికన మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం మార్చి 31కి పూర్తి కావాలి

వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్‌లు వెంట వెళతారు. డాక్టర్‌ సేవలు అందించడానికి విలేజ్‌ క్లినిక్‌ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్‌ కూడా చేయాలి. పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్‌ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలి. – సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్‌ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు.

ఈ మేరకు తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్‌ చేయగలుగుతారన్నారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.  

నిధుల లోటు రాకూడదు
► ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలకు ఏకంగా రూ.16,270 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిధులు కూడా ఆ మేరకు ఇచ్చేలా చూడాలి. నాడు–నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలి.
► మార్చి 31 నాటికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలి. నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలి.
► వీటి నిర్వహణలో నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మొదట్లో బాగున్నా.. సరైన శ్రద్ధ, దృష్టి లేకపోతే మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు. అద్భుతంగా కట్టడమే కాకుండా, ఆస్పత్రులను సరైన ప్రమాణాలతో నడపడం అత్యంత కీలకం.  
మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సత్వరమే చర్యలు
► ‘పలాస సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయి. కడప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు మొదలు పెట్టాం. 2023 జూన్‌ నాటికి ఆ పనులు పూర్తి చేస్తాం. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి నెలాఖరులోగా టెండర్లు ఆహ్వానిస్తాం’ అని అధికారులు వివరించారు. 
► మిగిలిన 12 చోట్ల మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపైనా సత్వరమే చర్యలు తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన కదలాలని సీఎం అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో నాడు –నేడు పనులను 2021 సెప్టెంబర్‌ నాటికి.. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

హెల్ప్‌ డెస్క్‌ కీలకం
► ఆరోగ్యశ్రీ అమలు తీరును, కార్డుల పంపిణీ, ఆరోగ్య ఆవసరాలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. 
► ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, అదనంగా 638 ప్రొసీజర్లకు కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించగా, దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 
► ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సీఎం సూచించారు. అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 
► నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. 
► ‘ఒక పేషెంట్‌గా మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సమాచారం, సహకారం ఆశిస్తామో.. అలాంటి సహకారాన్ని, సమాచారాన్ని ఆరోగ్యమిత్రలు అందించాలి. ఆరోగ్యశ్రీ, హెల్ప్‌డెస్క్‌ల సర్వీసు ప్రతి రోజూ మెరుగు పడాలి. పేషెంట్లకు పూర్తి స్థాయిలో సంపూర్ణ సేవలు అందేలా చూడాలి. రిఫర్‌ చేయడం.. అంబులెన్స్‌లను రప్పించుకోవడం తదితర అంశాలపై ప్రొటోకాల్, ప్రొసీజర్లపై గ్రామ సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి. పేషెంట్ల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి’ అని సీఎం తెలిపారు.   

ఆరోగ్యం బాగోలేనప్పుడు రోగికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులు ఏవన్నది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. 104 నంబర్‌కు ఫోన్‌ చేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న దానిపై పేషెంట్‌కు అవగాహన కల్పించాలి. పేషెంట్‌ తన గ్రామం, మండలం పేరు చెప్పగానే.. అందుబాటులో ఉన్న రిఫరల్‌ ఆస్పత్రులు ఏవేవి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలు చెప్పాలి. వెంటనే ఆరోగ్య సిబ్బంది ద్వారా వారికి సరైన సహాయం, సహకారం అందించేలా చూడాలి. 

తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు 
► ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆధారాలు సేకరించి ఆయా ఆస్పత్రులపై జరిమానాలు కూడా విధించామని చెప్పారు. అలాంటి ఆస్పత్రులను ప్యానెల్‌ నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 
► అంబులెన్స్‌ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేందుకు నిరంతరం పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారు. అవి ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలన్నారు. అవసరం అనుకుంటే.. మండలాల జంక్షన్లలో అదనంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top