
పౌర వేదిక రౌండ్‌టేబుల్ సమావేశం హెచ్చరిక
సాక్షి, అమరావతి: విజయవాడ పాత బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆర్టీసీ స్థలాలను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఉద్యమాలకు సిద్ధం కావాలని పౌర వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ట్యాక్స్‌పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఆర్టీసీ స్థలాలను ‘లులు’ సంస్థకు కట్టబెడితే సహించేది లేదని వక్తలు స్పష్టం చేశారు. వివిధ దశల్లో పోరాటాలను ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
ఇందులో భాగంగా ఆగస్టు 6న విజయవాడ పాత బస్టాండ్ వద్ద ధర్నా చేయాలని సమావేశం నిర్ణయించింది. విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లులు కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ‘ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు.
రూ.400 కోట్ల విలువ చేసే 4.50 ఎకరాల పాత బస్టాండ్‌ను లులు కంపెనీకి కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని, 137 జీఓను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసేంత వరకు ఉద్యమించాలని సమావేశం నిర్ణయించింది. జీవోను రద్దు చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం ఇవ్వాలని, దశలవారీగా పోరాటాలు చేయాలని సమావేశం తీర్మానించింది.
ప్రజాపోరాటాలు చేయాల్సిందే: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సమావేశంలో మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రూ.వందల కోట్ల విలువ చేసే విజయవాడ పాత బస్టాండ్‌లో 4.5 ఎకరాలు, విశాఖలో 14 ఎకరాల స్థలాలను ‘లులు’ కంపెనీకి అత్యంత కారు చౌకగా ధారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 137 రద్దు అయ్యేంత వరకు ప్రజాపోరాటాలతోపాటు న్యాయపోరాటం కూడా చేయాలని పిలుపునిచ్చారు. ప్రజోపయోగ ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు సంస్థలకు, కంపెనీలకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాలని 2012 ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన ‘ల్యాండ్ ఎలాట్‌మెంట్ యాక్ట్’ స్పష్టం చేస్తోందన్నారు. అటువంటి నిబంధనలను వేటినీ పాటించకుండా చట్టవిరుద్ధంగా, అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కూటమి ప్రభుత్వం స్థలాలను కట్టబెడుతోందన్నారు.
మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ ఎంతో విలువైన ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం సరికాదన్నారు. ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు మేధావులు, అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఐలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆర్టీసి స్థలాలతోపాటు రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల పంట భూములను కార్పొరేట్, బడా కంపెనీలకు కూటమి ప్రభుత్వం కట్టబెట్టడానికి వ్యతిరేకంగా న్యాయపోరాటాలు, ప్రజాపోరాటాలు చేయాల్సి ఉందన్నారు.
పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆర్టీసీపై దాడి జరుగుతూనే ఉందని, ఆర్టీసీ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని అన్నారు. సమావేశంలో ఎస్‌డబ్లు్యఎఫ్ అధ్యక్షులు సుందరయ్య, జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కె.కేశవరావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు వి సాంబిరెడ్డి, భవానీప్రసాద్ తదితరులు మాట్లాడారు.