దర్గా దగ్ధం దొంగల పనే

Chittoor SP Senthilkumar Comments About Dargah Burning Incident - Sakshi

ఘటన వెనుక మత విద్వేషాలు లేవని దర్గా నిర్వాహకుడు జిలానీ ప్రకటన 

దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ హెచ్చరిక 

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లిలోని దర్గా దగ్ధం ఘటన దొంగల పనేనని, దీనివెనుక ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదని దర్గా నిర్వాహకుడు జిలానీ బాషా స్పష్టం చేశారు. ఈ ఘటనను పురస్కరించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేదని, దర్గాలనూ వదలడం లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జిలానీ బాషా సెల్ఫీ వీడియో ద్వారా గట్టి బదులిచ్చినట్టయ్యింది. ఈ ఘటనపై జిలానీ ఆ వీడియోలో ఏమన్నారంటే.. ‘నా పేరు జిలానీ బాషా. మా నాన్న పేరు అల్లాబక్షు. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఒక దర్గా నిర్మించారు. అప్పటినుంచి అక్కడ హిందూ ముస్లింలు ఎటువంటి మత విభేదాలకు తావు లేకుండా మత సామరస్యంతో సద్భావంతో ఉరుసు ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలంతా మత సామరస్యం కలిగినవారే. విలువైన వస్తువులు, హుండీలోని డబ్బుల కోసం ఈ నెల 16 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి దర్గాలోకి ప్రవేశించారు. ఎటువంటి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కోపంతో అక్కడ ఉన్న పాత చద్దర్‌లను తగులబెట్టారు. దీనిపై నేను గంగవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. దీనికి బాధ్యులైన వారిని పోలీసులు తొందర్లోనే పట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి మత విభేదాలూ లేవని మరొక్కసారి చెబుతున్నాను’ అని స్పష్టం చేశారు.

మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు 
నాగిరెడ్డిపల్లి దర్గా ఘటనకు కారణమైన నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్‌.సెంథిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీన రాత్రి జిలానీ బాబా దర్గాలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి దర్గాలోని మజార్‌పై నుంచి తీసేసిన చద్దర్‌లను, కొన్ని పాత వస్తువులు కాల్చారన్నారు. దర్గా నిర్వాహకుడు జిలాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజానిజాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ factcheck.ap.gov.in  ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ప్రార్థనా స్థలాలు, ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కన్పించినా, విద్రోహ చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా అటువంటి వారి సమాచారాన్ని డయల్‌ 100కు గానీ, పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 94409 00005కు గాని తెలియజేయాలని ఎస్పీ కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top