కుప్పంను వీడుతున్న ‘చంద్ర’ గ్రహణం

Chittoor Developed Under The YCp Government - Sakshi

సాక్షి, చిత్తూరు: కులం చూడం.. మతం చూడం..  వర్గాలు చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చూడం..  అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాం.’’ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ హామీలను ముఖ్యమంత్రి కాగానే అక్షరాలా నిజం చేసి చూపించారు. కులాలు, మతాలు, వర్గాలే కాదు.. రాజకీయలకు అతీతంగా కూడా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గమే. ఈ నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించినా.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు పెద్ద దిక్కుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 

14,653 మందికి ఇళ్లపట్టాలు 
కుప్పం నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే 14,653 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో 5,158 మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి 4,150 మందికి మాత్రమే పంపిణీ  చేశారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద గతంలో ఐదేళ్లలో 4,691 మంది లబ్ధిపొందగా.. ఈ రెండేళ్లలోనే 3,712 మందికి లబ్ధిచేకూరింది. 

అర్హులందరికీ పింఛన్లు
గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పథకాలు లభించేవి. ప్రస్తుతం అలా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో 2014–19 మధ్య 30,970 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. ఇందుకు కేటాయించిన నిధులు రూ. 653.41 లక్షలు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో గతంకన్నా ఎక్కువగా 34,956 మందికి రూ.844.83 లక్షల మేర పింఛన్లు అందిస్తున్నారు. 

గతంలో 44 భవనాలు.. ప్రస్తుతం 83 
గత ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 44 పక్కా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించారు. ప్రస్తుతం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 83 గ్రామ సచివాలయ, పంచాయతీ భవనాలను నిర్మించారు. గతంలో 44 భవనాలకు రూ.592 లక్షలు ఖర్చు చేయగా, ప్రస్తుతం 83 భవనాలకు రూ.2480 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గతం కన్నా నాలుగింతలు ఎక్కువ నిధులతో నాణ్యమైన, అధునాతన హంగులతో భవనాలను నిర్మిస్తున్నారు. 

13,486 మందికి ఆరోగ్య‘సిరి’
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో 13,468 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించారు. ఈ పథకం ద్వారా వారికి రూ.23కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత పాలనలో 9,348 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలను అందించారు. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ద్వారా 750 మందికి చికిత్సలు చేయించారు. 

53,187 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు
కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఆదుకుంది. 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. గత పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పిల్లల చదువులకు అమ్మఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 

సర్కారు బడుల అభివృద్ధికి రూ.1853.84 లక్షలు 
కుప్పం నియోజకవర్గంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 2019–20 సంవత్సరాల్లో 46 సర్కారు బడుల నూతన భవనాలను రూ.715.84 లక్షలను ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. అలాగే 43 సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూ.1138 లక్షలతో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత సర్కారు 85 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి చేతులు దులుపుకుంది.

ఉన్నత కోర్సులకు చేయూత 
ఇంటర్మీడియట్‌ తర్వాత పై చదువులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆ నియోజకవర్గంలో చదువుతున్న 14,646 మంది విద్యార్థులకు రూ.14.31కోట్లతో జగనన్న విద్యాదీవెన, 15,498 మందికి రూ.10.57 కోట్లతో జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేశారు.

ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం 
కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేలా గ్రానైట్‌ సర్వే స్టోన్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్‌ ఏర్పాటవుతోంది.

కుప్పం నడిబొడ్డున ఉన్న గంగమ్మ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్నది స్థానికుల కల. ఏటా నిర్వహించే జాతరకు సమీపంలోని కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి  భక్తులు వస్తుంటారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప దేవాలయ పునర్నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. గుడి ముందు 70 సెంట్ల డీకేటీ స్థలాన్ని అగ్నిగుండంకు కేటాయించనుండటం విశేషం.

కుప్పంకు సమీపంలోని డీకేపల్లి, కుప్పం నగరంలోని రైల్వేబ్రిడ్జిల సమస్య 2004వ సంవత్సరం నుంచి అపరిష్కృతంగానే ఉంది. ఈ సమస్య వల్ల సమీపంలోని 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చొరవ చూపి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రెండు నూతన రైల్వే అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top