
విధి నిర్వహణలో ఉండగా మంచు కొండచరియలు విరిగిపడి దీపావళి నాడు మృతి
Army Jawan Karthik Kumar Reddy Funeral: చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని బంగారువాండ్లపల్లెకు చెందిన ఆర్మీ జవాన్ పి.కార్తీక్‌కుమార్ రెడ్డి (29) విధి నిర్వహణలో ఉండగా మంచు కొండచరియలు విరిగిపడి దీపావళి నాడు మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి జవాను భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు. మృతదేహం ఆదివారం వస్తుందని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఉదయం 10 గంటలకే బంగారువాండ్లపల్లెకు చేరుకున్నారు.
భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు జవాన్ నివాసానికి తీసుకువెళ్తుండగా అంగళ్లు, కనికలతోపు, బురకాయలకోట, వేపూరికోటలో అంబులెన్స్‌ను నిలిపి స్థానిక ప్రజలు పూలను చల్లి ఘనంగా నివాళులరి్పంచారు. యువకులు బైక్ ర్యాలీ నడుమ భౌతికకాయాన్ని బంగారువాండ్లపల్లెకు తీసుకెళ్లారు. ఆర్మీ అధికారులు, జవానులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జాతీయ జెండాను భౌతికకాయంపై కప్పి సంతాప సూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.
మదనపల్లి సబ్‌కలెక్టర్ జాహ్నవి, డీఎస్పీ రవిమనోహరాచారి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి విజయశంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో జవాను తల్లి సరోజమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. జవాను కుటుంభసభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.