ఎవరున్నారో తేల్చాలి..

Chinna Jeeyar Swamy Comments On Temples Issue - Sakshi

గుళ్లల్లో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది?

త్రిదండి చినజీయర్‌ స్వామి

సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి కొండపై స్వామి మంగళవారం మీడియాతో మాట్లాడారు.

వ్యక్తులకు ఉండే ద్వేషాలను ఇలా చూపించడం సరికాదని హితవు పలికారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ప్రజల్ని ఉద్రేకపర్చొద్దు: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో పెద్ద సంఖ్యలో గుళ్లను కూల్చిన ఘటనలపై మీడియా ప్రశ్నించగా.. ఆ గుడులను మళ్లీ నిర్మిస్తామని చెప్పడంతో తాను జోక్యం చేసుకోలేదన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేసినప్పుడు కూడా తాను యాత్ర చేస్తానన్నానని.. కానీ అప్పుడు హైకోర్టు జడ్జి ఒకరు పునరాలోచించుకుంటే బాగుంటుందని సూచించడంతో దాన్ని వాయిదా వేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సెన్సేషన్‌ చేసి ప్రజల్ని ఉద్రేకపరచకూడదన్నారు. మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడివేయొద్దని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top