చుక్కల్లో ధరలు.. కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రేటెంతో తెలుసా? | Chicken Prices Soar at Farmgate Level due to High Feed Costs | Sakshi
Sakshi News home page

రైతుల వెనుకంజ.. చుక్కల్లో ధరలు.. కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రేటెంతో తెలుసా?

Apr 6 2022 3:12 PM | Updated on Apr 6 2022 6:01 PM

Chicken Prices Soar at Farmgate Level due to High Feed Costs - Sakshi

40 రోజుల్లో బ్రాయిలర్‌ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకూ పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సాక్షి, కాకినాడ(మండపేట): రెండు నెలలుగా చికెన్‌ ధర దిగి రానంటోంది. స్కిన్‌లెస్‌ కిలో రూ.300 నుంచి రూ.320తో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్‌ నెల మొదలు కావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్‌. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్‌ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి.

వేసవి ప్రభావం
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిల్లో 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్‌ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్‌ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకూ పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోళ్ల మేత ధరలు గణనీయంగా పెరగడం వీటి పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది.

చదవండి: (అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే..)

మొక్కజొన్న కిలో రూ.14 నుంచి రూ.25కు పెరగగా, సోయా రూ.40 నుంచి రూ.90కి పెరిగిపోయింది. అన్ని మేతలూ మిక్స్‌ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ.35కు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్‌ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకూ వ్యయమవుతోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధిక శాతం మంది బ్రాయిలర్‌ కోళ్ల రైతులు బ్రాయిలర్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడి పిల్లలను పెంచి, పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫారాలు నిర్వహిస్తున్నారు.

రెండు నెలలుగా అదే ధర
స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.200 వరకూ ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300కు, లైవ్‌ కిలో రూ.100లనుంచి రూ.150కి చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350 వరకూ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్‌ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింలు చికెన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్‌ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాల అంచనా.

నిర్వహణ పెరిగిపోయింది
ఎప్పుడూ లేనంతగా కోళ్ల మేత ధరలు, కోడి పిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంతో ధర పెరుగుతోంది.
– బొబ్బా వెంకన్న, బ్రాయిలర్‌ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement