బె‘ధర’గొడుతున్న చికెన్‌.. వేసవి కాలం కావడంతో.. భారీగా పెరిగిన రేట్లు!

Chicken Price Hike In Andhra Pradesh 1 KG Rate Rs 260 Touches Parvathipuram - Sakshi

కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం రూ.260 

లైవ్‌ కిలో రూ.160 కొత్త బ్యాచ్‌లకు పౌల్ట్రీ రైతులు వెనుకంజ 

సాక్షి, పార్వతీపురం: రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కుతోంది. వేసవి కాలం కావడంతో బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి తగ్గింది. కొత్త పౌల్ట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న పౌల్ట్రీల ద్వారానే కోళ్ల  సరఫరా జరుగుతోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్లు, పండగలు జరుగుతుండడంతో మాంసానికి డిమాండ్‌ పెరుగుతోంది. సీజన్‌ కావడంతో డిమాండ్‌  ప్రస్తుతం చికెన్, మటన్‌ల విక్రయాలకు డిమాండ్‌ పెరిగింది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకూ మాంసానికి సీజన్‌గా పరిగణిస్తారు.  

ఈ నెలల్లో ఎక్కువగా గ్రామ దేవతల సంబరాలు, ఇంటి వారాలు, యానాళ్లు,  అసిరితల్లి పండగలు వంటివి నిర్వహిస్తుంటారు.  చికెన్, మటన్‌ వంటి వంటకాలను ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. దీంతో ఏటా ఈ సమయంలో చికెన్‌ ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. గతంలో బ్రాయిలర్‌ కోడి చికెన్‌ ధర కిలో రూ. 220లు ఉండగా, ప్రస్తుతం రూ. 260 నుంచి రూ. 280 మధ్య పలుకుతోంది.

మరో వైపు బ్రాయిలర్‌ కోడి లైవ్‌ కిలో ధర గతంలో రూ 140 నుంచి రూ.150 మధ్య ఉండేది. ఇప్పుడు రూ.180 నుంచి రూ. 200 మధ్య పలుకుతోంది. ఇవి కూడా చికెన్‌ దుకాణాల వద్ద పరిమితంగానే ఉంటున్నాయి. పౌల్ట్రీల నుంచి ఉత్పత్తులు లేకపోవడంతో కోళ్లకు డిమాండ్‌ పెరిగి, మాంసం ధర పైపైకి వెళ్తోంది. 
చదవండి👉🏾 గంగపుత్రులకు మరింత చేరువగా..

వేసవి ప్రభావం  
ప్రతి పౌల్ట్రీకి 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్‌ కోళ్ల పెంపకానికి కంపెనీలు  పిల్లలను అందిస్తాయి. కొంతమంది సొంతంగా కొనుగోలు చేస్తారు. ఇవి 72 రోజుల వ్యవధిలో కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ పెరుగుతాయి. వేసవికాలంలో వీటిని పెంచేందుకు పౌల్ట్రీల వద్ద షెడ్డులు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసం డ్రిప్‌ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతుంటారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో బ్రాయిలర్‌ కోళ్లు అధికంగా చనిపోతుండడంతో దిగుబడి పూర్తిగా  పడిపోతోంది. వీటికి తోడు  కోడి మేత ధర పెరిగింది. బ్రాయిలర్‌ కోడికి ప్రధాన మేతగా పరిగణిస్తున్న సోయాబీన్‌ మేత కిలో రూ.102 నుంచి రూ.113 మధ్య ఉంది. గతంలో కిలో రూ. 60 ఉండేది. సాధారణ మొక్కజొన్న మేత కిలో రూ.13 లు నుంచి రూ.23కు ఎగబాకింది. 
చదవండి👉🏼 వినూత్న కేజ్‌ కల్చర్‌.. అద్భుత ప్యా‘కేజ్‌’

ఇతర ప్రాంతాల నుంచి.. 
జిల్లాలో దిగుబడి తక్కువ కావడంతో  విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు బ్రాయిలర్‌ కోళ్లు దిగుమతి అవుతున్నాయి. రవాణా చార్జీలు అదనంగా ఉండడంతో కోళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.   

నాటుకోడి కొనలేం  
బ్రాయిలర్‌ కోడి విషయం పక్కన పెడితే నాటుకోడి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. నిత్యం జరిగే వారపు సంతలతో పాటు మార్కెట్‌లో కూడా నాటుకోళ్లు జిల్లాలో లభిస్తున్నాయి. కిలో బరువు తూగే కోడి ధర రూ. 400 దాటి 500 వరకూ పలుకుతోంది, నాటుకోడి మాంసం ధర కూడా కిలో రూ. 500 చొప్పున విక్రయిస్తున్నారు.   

పెరిగిన బ్రాయిలర్‌ చికెన్‌ ధర  
బ్రాయిలర్‌ కోడి మాంసం ధర మార్కెట్లో పెరిగింది. ప్రస్తుతం వేసవికావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతోంది. పౌల్ట్రీల వద్ద దిగుబడి పెద్దగా ఉండదు. ఈ రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి. పౌల్ట్రీ నిర్వాహకులకు గతేడాది ఈ సమయంలో నష్టం వచ్చింది. ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  
-ఎ.ఈశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ, పార్వతీపురం మన్యం జిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top