గంగపుత్రులకు మరింత చేరువగా..

Changed Fisheries Appearance After Redistribution Of Districts - Sakshi

మారిన మత్స్యశాఖ స్వరూపం

రెండు డివిజన్లుగా ఫిషరీస్‌ డిపార్ట్‌మెంటు

మత్స్యకారులకు అందుబాటులోకి సేవలు

కొవ్వూరు: జిల్లాల పునర్విభజన పుణ్యమా అని మత్స్యకారులకు ఆ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టును ఇప్పుడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా మార్చారు. రాజమహేంద్రవరంలో 10, కొవ్వూరులో 9 మండలాలు ఉండేటట్లు జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్ల (ఏడీ) పర్యవేక్షణలో ఈ డివిజన్లు పని చేస్తాయి. రాజమహేంద్రవరం డివిజన్‌లో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు ఉంటాయి. ఈ డివిజన్‌లో ఏడీతో పాటు ఇద్దరు మత్స్యశాఖ డెవలప్‌మెంట్‌ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్లు, 10 మంది గ్రామ మత్స్యశాఖ సహాయకులు పని చేస్తారు. కొవ్వూరు డివిజన్‌లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు ఉంటాయి. ఈ ఏడీ పరిధిలో ఇద్దరు అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ మత్స్యశాఖ సహాయకులు ఉంటారు. 

గోదారే ఆధారం 
జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో మాత్రమే మత్స్యకారులున్నారు. వీరిలో గోపాలపురం మినహా మిగిలిన చోట్ల మత్స్యకారులు ప్రధానంగా గోదావరి నది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి జిల్లాలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ 41 కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తీర్ణం 12 వేల హెక్టార్లు కాగా, ఇందులో వెయ్యి హెక్టార్లలో నిరంతరం నీరుంటుందని మత్స్యశాఖ అధికారులు లెక్కలు కట్టారు. చేపలు గుడ్డు పెట్టే దశ కావడంతో ఏటా మే 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ గోదావరిలో వేట నిషేధం అమలులో ఉంటుంది. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకూ చేప పిల్లలను గోదావరి నదిలో విడిచిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 489 మంది రైతులు 974.99 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిడదవోలు, పెరవలి, బిక్కవోలు, సీతానగరం, చాగల్లు తదితర మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిగిలిన మండలాల్లో 50 ఎకరాల్లోపే ఈ సాగు జరుగుతోంది.

కడియంలో చేప పిల్లల నర్సరీ 
కడియంలో 6.54 ఎకరాల్లో మేజర్‌ చేపల పిల్లల నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా చిరు చేపపిల్లలు (స్పాన్‌) 5 కోట్లు, 12 ఎంఎం చేప పిల్లలు 53.21 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేపపిల్లలు 20 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అవసరమైన చేప పిల్లలను ఇక్కడి నుంచే సరాఫరా చేస్తున్నారు. గోదావరితో పాటు, ఏలేరు రిజర్వాయర్‌కు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారు. రైతులకు అవసరమైన చేప స్పాన్‌ను విక్రయిస్తారు. ప్రధానంగా బొచ్చలు, శీలావతి, మోసే, బంగారు తీగ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. 

మత్స్యసంపద అభివృద్ధికి చాన్స్‌ 
గోదావరి తీర ప్రాంతం కావడంతో మత్స్యసంపద అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల చేపపిల్లల్ని నదిలో విడిచిపెడుతోంది. ఏపీ ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద ఒక హెక్టారు చెరువు తవ్వి చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కడియం నర్సరీ ద్వారా అవసరమైన వారందరికీ చేపపిల్లలను అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ వాహనాలు, బోట్లు అందజేస్తున్నాం. వీటిని మత్స్యకారులు వినియోగించుకోవాలి. 
– ఇ.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top