సముద్రంలో మత్స్య సంపద అంచనాకు అధునాతన సాంకేతికత
ఎక్కడ ఎంత సంపద ఉందో డేటా సేకరించి పెంచేందుకు కృషి
నౌక నుంచే పర్యవేక్షించేలా కచ్చి తమైన ఈ–అబ్జర్వర్ సిస్టమ్
అందుబాటులోకి తీసుకొస్తున్న ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా
ముఖ్యంగా ట్యూనా సంతతిపై దృష్టి
సాక్షి, విశాఖపట్నం: సముద్ర గర్భంలో చేపలు దాగుడుమూతలాడినా చేపా... చేపా... ఇక్కడున్నావా? అని ఇట్టే పసిగట్టే అత్యాధునిక సాంకేతికతను భారతీయ మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) అభివృద్ధి చేస్తోంది. లాంగ్ లైన్ నౌకల కోసం చేపల వేట, మత్స్య సంపద గుర్తించేందుకు ఆన్‌బోర్డ్ ఎల్రక్టానిక్ అబ్జర్వర్ (ఈ–అబ్జర్వర్) వ్యవస్థ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపల పట్టుపై కచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత డేటా సేకరించేలా ఈ విధానం రూపొందిస్తున్నారు. సముద్రంలో ఎక్కడ ఎంత మత్స్య సంపద ఉంది? ఏఏ జాతులు ఎక్కడ ఉన్నాయో దీని ద్వారా వివరాలు సేకరించవచ్చు.
సముద్రంలో చేపల వేటను క్షుణ్నంగా పర్యవేక్షించడం, రికార్డ్ చేయడానికి ఈ అబ్జర్వర్‌ను ప్రవేశపెట్టే పనిలో ఎఫ్‌ఎస్‌ఐ నిమగ్నమైంది. తొలి విడతలో లాంగ్‌లైన్ ఫిషింగ్ షిప్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. తర్వాత ఇతర అన్ని రకాల చేపల వేటకు వెళ్లే ఓడలపై ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.
సముద్రంలో చేపల అంచనా, మత్స్య సంపద నిర్వహణను పర్యవేక్షించేలా కచ్చి తమైన శాస్త్రీయ డేటాను ఈ–అబ్జర్వర్ ద్వారా రూపొందించనున్నారు. దీని తయారీలో హిందూ మహా సముద్ర ట్యూనా కమిషన్ (ఐవోటీసీ) సహకారం అందిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపల వేట, మత్స్య సంపద వృద్ధి ఉంచేందుకు ఈ–అబ్జర్వర్ దోహదపడుతుంది. స్థిరమైన ఫిషింగ్ పద్ధతులకు మరింత సానబెట్టి దేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పోటీలో భారత్‌ను మరింత ముందుకు నడిపించే వ్యవస్థగా మారనుంది.
ఈ అబ్జర్వర్ వ్యవస్థ ముఖ్యాంశాలు
» ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వ్యవస్థ లాంగ్‌లైన్ ఫిషింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.సముద్రంలో చేపల వేట, ఫిషింగ్ కార్యకలాపాలపై కచ్చితమైన, శాస్త్రీయంగా ధ్రువీకరించిన డేటాను సేకరిస్తుంది.
» దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి అవుతున్న ట్యూనా చేపల వేటను మరింత మెరుగుపరిచి మత్స్యకారులకు లాభాలు వచ్చేలా చేస్తుంది.
స్టాక్ అసెస్‌మెంట్‌లను మెరుగుపరచడం, సుస్థిర మత్స్య సంపద నిర్వహణకు మద్దతు ఇచ్చేందుకు డేటా ఉపయోగపడుతుంది.
» ఈృఅబ్జర్వర్ ఇచ్చే డేటా అంతర్జాతీయ మార్కెట్లలో భారత దేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే కాక వాణిజ్య విస్తరణకు దోహదపడుతుంది.
» దేశవ్యాప్తంగా ఇప్పటికే 36 వేల ఫిషింగ్ బోట్లపై ట్రాన్స్‌పాండర్స్‌ను ఎఫ్‌ఎస్‌ఐ అమర్చింది. వీటి ఆధారంగా
ఈృఅబ్జర్వర్ ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
» త్వరలోనే కొచ్చిలో ప్రారంభించి.. తర్వాత విశాఖపట్నం, చెన్నై హార్బర్‌లలో ప్రవేశపెట్టనున్నారు.


