
దసరా ఎఫెక్ట్ కిలో ధర రూ.900
మటన్‌కు పోటీగా పెరుగుదల
సందడిగా నాటుకోళ్ల సంత
విశాఖపట్నం: దసరా పండుగ సందర్భంగా నాటుకోళ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సాధారణంగా దసరా సమయంలో కేవలం రూ.10 నుంచి రూ.25 మాత్రమే పెరిగే ధర ఈసారి ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. మటన్‌కు దీటుగా ధరలు పెరిగినప్పటికీ, దసరా మొక్కుల కోసం వినియోగదారులు నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత డెయిరీఫారం వద్ద ఉన్న నాటుకోళ్ల సంతలో ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. మంగళ, బుధవారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు.
40 ఏళ్ల నాటుకోళ్ల సంత
పాత డెయిరీఫారం వద్ద సుమారు 40 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల సంత జరుగుతోంది. ప్రారంభంలో కోడి రూ.20, రూ.30కే విక్రయించేవారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు.
గిరిరాజు కోళ్లతో జాగ్రత్త
నాటుకోళ్ల మాదిరిగానే కనిపించే ‘గిరిరాజు’ కోళ్లను కొందరు వ్యాపారులు అధిక ధరకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుందని, కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు.