గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ నిరవధిక పొడిగింపు
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమలులో ఉంటుందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
కౌంటర్‌కు మరో రెండు నెలలు గడువు కోరిన సిట్‌పై అసహనం
ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేందుకే ఇలా చేస్తున్నారని మండిపాటు
కాలయాపన కోసమే సిట్ పదేపదే వాయిదాలు కోరుతోందని ఘాటు వ్యాఖ్య
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/తిరుపతి రూరల్: మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయనకిచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అదనపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునంటూ సీఐడీ సిట్‌కి రెండు నెలల గడువునిచ్చింది. ఆ తరువాత ఆ అదనపు కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు మోహిత్‌కు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్దేశపూర్వక జాప్యానికి తప్ప..
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. మోహిత్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే నెలల తరబడి సమయం తీసుకున్న ప్రాసిక్యూషన్, ఇప్పుడు అదనంగా మరో రెండు నెలల సమయం కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా ‘ఇంకా పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయి‘ అని చెప్పడం విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘మైదానంలో క్రీడాకారుడు ఎలాగైతే ఆటను సాగదీయాలని చూస్తాడో, ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది.’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కేవలం విచారణను కాలయాపన చేసేందుకే ప్రాసిక్యూషన్ పదేపదే వాయిదాలు, సమయం కోరుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
కౌంటర్ దాఖలులో సిట్ జాప్యం
మద్యం కేసులో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ గత ఏడాది అక్టోబర్ 7న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మోహిత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోహిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్ 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మోహిత్ ముందస్తు బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ సిట్‌ను ఆదేశించింది.
తదుపరి విచారణను గత ఏడాది డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కేసు విచారణకు రాగా, కౌంటర్ దాఖలుకు సిట్ మరో నెల రోజుల సమయం కోరింది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ మరో రెండు నెలల సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి ఉత్తుర్వులు జారీ చేసేంత వరకు పొడిగించింది. సిట్ కోరినట్లు కౌంటర్ దాఖలుకు రెండు నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


