
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా అంతర్జాతీయస్థాయి వైద్య సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల కార్పొరేట్ ఆస్పత్రులను హెల్త్ హబ్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. తొలుత పిలిచిన బిడ్డింగ్‌లో కర్నూలు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన చోట్ల కూడా ప్రముఖ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధంగా టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేకుండా, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీనీ రెండేళ్లకే పరిమితం చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థలను తీసుకువచ్చే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. నిబంధనలు మారినందున బిడ్ల దాఖలు గడువును ఈనెల 18 వరకు పెంచుతూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. బిడ్లను పరిశీలించిన తర్వాత.. ఎంపికైన సంస్థ వివరాలను ఏప్రిల్ 15న వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ఆరోగ్య శ్రీకి కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది.