Chandrababu Who Turned Medical Education Into A Business - Sakshi
Sakshi News home page

పెత్తందారులకు ‘ప్రైవేట్‌’ జబ్బు! 

Jul 21 2023 4:33 AM | Updated on Aug 11 2023 1:50 PM

Chandrababu who turned medical education into a business - Sakshi

చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను ప్రోత్సహించి జేబులు నింపుకొనేందుకే తపించారు. ఒక్కటైనా ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్ప­లేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాలికి వదిలేశారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఖండాతరాలు దాటి వెళ్తుంటే నాడు  రాజ గురివింద నోరెత్తిన పాపాన పోలేదు!!

ఇప్పుడు వైద్య రంగం బలం పుంజుకుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో కొత్తగా 17 వైద్య కళాశా­లలు సమకూరుతున్నాయి. మన విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు పెరిగాయి. సామాన్యుడికి సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు మరింత మెరుగ్గా అన్ని చోట్లా అందుబాటులోకి వస్తాయి. దీంతో గుండెలదిరిన ఫిలింసిటీ పెత్తందారు యథాప్రకారం చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు ఆరాటపడ్డారు!!

సాక్షి, అమరావతి: మెడికల్‌ కాలేజీ నిర్వ­హణ ఆషామాషీ కాదు! వసతులు, సి­బ్బంది విషయంలో తేడావస్తే ఆ ప్రభా­వం సీట్ల సంఖ్యపై పడుతుంది! వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలనే సదుద్దేశంతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల విధానాన్ని తెస్తుంటే వైద్య రంగాన్ని తెగనమ్మేస్తున్నట్లు రామోజీ కన్నీళ్లు కా­ర్చా­రు! ఈ ఏడాది మచిలీపట్నం, ఏ­లూరు, రాజమహేంద్రవరం, విజయ­నగ­రం, నంద్యాలలో ఐదు కొత్త మెడికల్‌ కాలే­జీలు ప్రారంభమవుతు­న్నాయి.

ఒ­క్కో­దా­నిలో 150 చొప్పున 750 ఎంబీబీ­ఎస్‌ సీట్లు అదనంగా సమకూరాయి. ఒ­క్కో వైద్య కళాశా­లకు బోధన, నర్సింగ్, పారామె­డి­కల్, ఇతర సహాయ సిబ్బంది­తో కలిపి 1,013 మంది ఉద్యోగులు అవసరం. కళా­శాల నిర్వహణకు ఏటా రూ.225 కోట్లు కావాలి. మొత్తంగా 17 మెడికల్‌ కాలేజీల కోసం ఏడాదికి రూ.3,825 కోట్లు వ్యయం అవుతుంది. ప్రభుత్వం కట్టేవేమీ కామి­నేని, నారాయణ మెడి­కల్‌ కాలేజీలు కావు! కొత్త కాలేజీల్లో యాభై శాతం సీట్లు జనరల్‌ కేటగిరీలోనే ఉంటాయి.

మిగిలినవి మాత్రమే బీ, సీ కేటగిరీల్లోకి వెళ్తాయి. అయినా ఆ డబ్బేమీ ప్రైవేట్‌ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. పలు కేటగిరీల ద్వారా వచ్చే డబ్బు ఆయా కాలేజీలకే చెందుతుంది. వాటితో సంబంధిత మెడికల్‌ కాలేజీ బాగోగులను చూసుకుంటూ సమర్థంగా నిర్వహి­స్తారు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అదనంగా అందుబాటులోకి వస్తాయి. 

ఈ ఏడాది కొత్తగా వచ్చే ఐదు కాలేజీల్లో 113 సీట్లు (15 శాతం) ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 637 సీట్లలో 319 సీట్లను (50 శాతం) జనరల్‌ కోటాలో భర్తీ చేస్తారు. 35 శాతం అంటే 223 సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో, 15 శాతం అంటే 95 సీట్లను ఎన్నారై కోటా కింద భర్తీ చేస్తారు. కేవలం కొత్త కళాశాలలకే ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నారు. 
 ఇప్పటివరకు ఉన్న 12 ప్రభుత్వ మెడికల్‌ కళాశా­లల్లో 2,360 సీట్లు ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే 17 కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు పెరుగు­తాయి. అంటే రెట్టింపు దాటి పెరుగు­తున్నాయి. ప్రభుత్వం రంగంలో 29 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రావడం ద్వారా ఎంబీబీఎస్‌ సీట్లు ఏకంగా 4,910కి పెరుగుతాయి. అప్పుడు మన విద్యార్థులకు మంచి జరుగుతున్నట్లే కదా?

ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా
♦ నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి­కప్పుడు ఖాళీ­లను భర్తీ చేసేలా ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు.  
♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే సేవలు.
♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు. నెలకు 2 సార్లు గ్రా­మా­లకు పీహెచ్‌సీ వైద్యులు. ఇప్పటి­వ­ర­కూ 1.70 కోట్లమందికి సొంతూళ్లలోనే వైద్యం.  
♦ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్య­యం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో వి­శ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇ­ప్ప­టివరకూ 17.25 లక్షల మందికి రూ.1,0­74.69 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.
 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలో­పేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు.   
♦  ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూ­హెచ్‌­వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement