అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి.. | Chandrababu is once again deceiving the people in the matter of Amaravati | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..

May 15 2026 12:12 PM | Updated on May 15 2026 12:27 PM

Chandrababu is once again deceiving the people in the matter of Amaravati

వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన,  కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన  పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే  మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద  వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి  వైనం   అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే  ఎవరైనా అక్కడ ఇల్లు  కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న  విమర్శలు ఉన్నాయి. 

తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు  అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర  ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు  ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు.  టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.  వడ్డే  శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. 

అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే  పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది.  అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన  ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు  రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను  ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. 

ఇదంతా ఏపీ ప్రజలపై పడే  భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల  నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య  అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు  పంటలు  పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన  బొలిశెట్టి సత్య  ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు  పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.

ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున  యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి  భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద  ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న  ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.

అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు  వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత  పటిష్టంగా  ఉంటే  ఏమి చేసుకున్నా ఎవరూ  కాదనరు,కాని ఒక పక్క చెప్పిన  హామీలకు డబ్బులు లేవని పదే,పదే  వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను  అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల  కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన  భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో  ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల  వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై  రైతులు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని  ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని  పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను  రైతులు  అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ  మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు  కూటమి నేతల తీరుపై మండిపడుతూ  తమకు మద్దతు ఇచ్చే  వారివైపు ఆశగా ఎదురు  చూస్తున్నారు.

ఇవన్ని ఒక ఎత్తు అయితే  తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి  సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్   బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో  వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన  ఒక రైతు  కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని  ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు  ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.

ఎకరా 20 కోట్లు  ఉందని ఆయన  ప్రచారం చేస్తున్నారు  కాని,  తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు.  ఆయన  ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్  రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా  కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement