
రూ.12,771 కోట్లు కావాలన్న డిస్కంలు
ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం
దీనికి అనుమతించాలంటూ ఏపీఈఆర్సీకి తాజాగా ప్రతిపాదన
ఇప్పటికే ప్రజలపై రూ.19,114.72 కోట్ల వడ్డన
అధికారం ఇస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామన్న చంద్రబాబు
మాట తప్పి జనంపై మొత్తంగా రూ.31,886.68 కోట్ల చార్జీల భారం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకానెల విద్యుత్ చార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా రూ.12,771 కోట్ల చార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇదేనా బాబు సంపద సృష్టి?
వెన్నుపోటు పొడవడంలో పేటెంట్ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ, తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్లను జోడించారు.
ఇది చాలదన్నట్లు ఇటీవల మరో రూ.3629.36 కోట్ల చార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి... అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి.
దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు.
మొత్తం రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేయడం గమనార్హ. మరో రూ.842.17 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీని అనుమతి కోరగా, దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపినట్లైంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఇదేనా సంపద సృష్టి’’ అని ప్రజలు నిలదీస్తున్నారు.
జనం సొమ్ముతో రూ.12,771 కోట్ల లోటు భర్తీ
ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్ల చొప్పున లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి.
ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజలు తమ అభ్యంతరాలను ఆగస్టు 14వ తేదీలోగా ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది.
ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం చార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ, దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండడం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ చార్జీలపై వ్యతిరేకంగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.