
అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.
మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.
ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
