పేదల సొంతింటి కలపై నీళ్లు | Chandrababu Govt Negligence in Utilization of Funds Provided by Centre | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కలపై నీళ్లు

May 8 2026 5:22 AM | Updated on May 8 2026 5:22 AM

Chandrababu Govt Negligence in Utilization of Funds Provided by Centre

కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం

రూ.200 కోట్ల మేర వినియోగంలో ఘోర వైఫల్యం 

పేదలు కట్టుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయని వైనం 

అధికారుల ప్రణాళికకూ చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వడంతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పేదలకు గజం స్థలం, ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అంతటితో ఆగకుండా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయకుండా కుట్రలు పన్నుతోంది. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా లబ్ధిదారులకు చెల్లించడానికి బాబు సర్కారుకు మనసొప్పడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల మేర నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చింది.వాటిని తిరిగి కేంద్రానికే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  

అధికారుల ప్రణాళికకు అడ్డుపుల్ల! 
కేంద్రం పేదల ఇళ్ల కోసం విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్‌ చేసి, ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించి­న దశలు పూర్తయ్యాక విడుదల చేసేలా గృహ నిర్మాణ శాఖ ఉన్న­తాధికారులు ప్రణాళిక రూపొందించారు. 2025–26 ఆర్థిక సం­వత్సరం ముగిసే సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలిసింది. దీనివల్ల నిధులు రాష్ట్రంలోనే ఉండటంతోపాటు పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు లభించేది. కానీ, ఈ నిర్మాణాత్మక ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో అధికారులు పంపిన ప్రతిపాదనలను కీలక ప్రజాప్రతినిధి తిరస్కరించినట్టు తెలుస్తోంది.  

బిల్లులు చెల్లించకుండా నిధులు వెనక్కు
ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లో పొందుపర్చిన బిల్లులు రూ.30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. నిధులు తిరిగి కేంద్రానికి వెనక్కి పంపకుండా బిల్లులు విడుదల చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. అయితే ఇందుకు కీలక ప్రజాప్రతినిధి అడ్డు తగులుతున్నారని సమాచారం. పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లించడానికి వీల్లేకుండా గృహ నిర్మాణ సంస్థలోని కీలక అధికారిని ప్రజాప్రతినిధి సెలవుపై పంపేశారని విమర్శలు వస్తున్నాయి. పెండింగ్‌ బిల్లులు ఇప్పుడు చెల్లిస్తే తమకు క్రెడిట్‌ దక్కదనే దురాలోచనతో ఈ కుట్రకు తెరలేపినట్టు తెలుస్తోంది. దీంతో  కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగాన్ని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) విధానం నుంచి స్పర్శ్‌లోకి మార్చి రూ.200 కోట్లు తిరిగి కేంద్రానికి అప్పగించడానికే బాబు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement