విద్యా దీవెనకు తూట్లు.. వసతి దీవెన ఎగవేత బీఆర్‌వోల పేరుతో బాబు సర్కారు డ్రామా
బకాయిలతో కలిపి మొత్తం రూ.10,700 కోట్లు అవసరం
ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లు
విద్యార్థుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు
ఉన్నత విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు
ప్రభుత్వ వర్సిటీల నుంచి ఏకంగా రూ.1,500 కోట్ల నిధులు దారి మళ్లింపు
ఉన్నత విద్య కోసం వైఎస్ జగన్ హయాంలో రూ.18,663.44 కోట్లు వ్యయం
గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లను కూడా చెల్లించిన వైఎస్సార్‌సీపీ సర్కారు
‘‘ఫైనలియర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చేవరకూ మేం ఎదురు చూడలేం. ఫీజు కడితేనే చివరి ఏడాది పరీక్షలు, ప్రాజెక్టు సబ్మిషన్‌కు వెళ్లనిస్తాం..!’’ విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రముఖ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం అల్టిమేటం ఇదీ! పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ తమకు ప్రభుత్వం చెల్లిస్తుందని.. విద్యార్థులు కట్టాల్సింది ‘సున్నా’ అని అడ్మిషన్ సీటు అలాట్‌మెంట్ లెటర్‌లో చూపించిన కాలేజీ యాజమాన్యం.. ప్రస్తుతం ఫైనలియర్ విద్యార్థులు రూ.50 వేల చొప్పున బకాయిలు కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఒక్క విశాఖే కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు సర్కారు అటకెక్కించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇదే! చరిత్రలో ఎన్నడూ లేనంత బకాయిలు పేరుకుపో వడం కూటమి పాలనలో దిగజారిన విద్యారంగం పరిస్థితికి నిదర్శనం.
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను మిథ్యగా మార్చేసింది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యా నాణ్యత పూర్తిగా దిగజారింది. పిల్లల చదువులు ఆగిపోతుండగా.. కాలేజీలు దివాళా తీసే దుస్థితి దాపురించింది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో పేద కుటుంబాలు ఆర్థిక భారంతో చితికిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు. అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమే.
రాష్ట్రంలో గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు రూ.6,300 కోట్లు ఫీజుల బకాయిలతోపాటు రెండేళ్లుగా వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం అరకొరగా విదిలిస్తోంది. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే రూ.6,100 కోట్లు బకాయిలు పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం రూ.3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లు!
నమ్మించి నయ వంచన..
ఒకవైపు ఫీజులను తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కారు మరోవైపు కనికట్టు చేసింది. రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌వోలు) ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేమిటని అడిగితే చావుకబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55 శాతం వడ్డీ రేటుతో అప్పు తెచ్చి, ఆ డబ్బులిస్తామని.. అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలిక పెట్టింది. దీనిపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి పిలుపు ఇవ్వడం.. కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు రెండు విడతల్లో రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి.
వర్సిటీల నిధులు దారి మళ్లింపు
ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోగా నిధులను దారి మళ్లించిన బాబు సర్కారు వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. తాజాగా మరో రూ.300 కోట్లు కూడా లాగేసుకుంది. మొత్తం రూ.1,500 కోట్లను వర్సిటీల నుంచి ప్రభుత్వం తన సొంత అవసరాల నిమిత్తం లాగేసుకుంది. దీంతోపాటు ఉన్నత విద్యా మండలి నిధులు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేçÜుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు ఆస్రే్టలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనావిుక్ డెవలప్‌మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు.
ఉన్నత విద్యపై వైఎస్ జగన్ హయాంలో రూ.18,663.44 కోట్లు వ్యయం
వైఎస్సార్‌సీపీ హయాంలో కరోనా విలయ తాండవం చేసినా ఐదేళ్లూ ఫీజుల పథకాన్ని సజావుగా కొనసాగించారు. అత్యంత పారదర్శకంగా తల్లుల ఖాతాల్లో ఫీజుల డబ్బులు జమ చేశారు. విద్యార్థుల శ్రేయస్సును కాంక్షిస్తూ గత ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. వైఎస్సార్‌సీపీ పాలనలో ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లను కూడా చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులను పెండింగ్‌లో పెట్టడంతోపాటు ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు.


