‘సిట్‌’ దర్యాప్తు వెర్రితలలు! | Chandrababu Govt False Cases Filed Against YSRCP Leaders Over Liquor Policy | Sakshi
Sakshi News home page

‘సిట్‌’ దర్యాప్తు వెర్రితలలు!

Jun 5 2026 4:42 AM | Updated on Jun 5 2026 4:42 AM

Chandrababu Govt False Cases Filed Against YSRCP Leaders Over Liquor Policy

ప్రభుత్వ పెద్దల కుట్రకు నిస్సిగ్గుగా వత్తాసు 

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అటెండర్‌కు కూడా నోటీసులు 

మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరిట కక్ష సాధింపు

సాక్షి, అమరావతి: పిచ్చి ముదిరిందీ అంటే తలకు రోకలి కట్టండి...! అన్నట్టుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు రోజురోజుకూ రాజకీయంగా దిగజారిపోతున్నారు. మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో ఏడాదిన్నరగా చేస్తున్న రాద్ధాంతం బెడిసికొడుతుండటంతో తీవ్ర అసహనంతో రగిలి­పోతున్నారు.

ఏమైనా చేయండి.. ఎవరిపై పడితే వా­రి­పై అక్రమ కేసులు బనాయించండి..! అని సిట్‌ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్రలకు సిట్‌ అధికారులు ఎంతగా వత్తాసు పలుకుతున్నారంటే.. చివరికి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అటెండర్‌ మనోహర్‌కు కూడా నోటీసు ఇచ్చారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతోపాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి నుంచి అటెండర్‌ వరకూ నోటీసులు ఇచ్చి అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం రాజకీయ కు­తం­త్రాలకు తెగబడుతున్న తీరు విస్మయపరుస్తోంది.  

ఐఏఎస్‌ నుంచి అటెండర్‌ వరకూ..  
పిచ్చివాడి చేతిలో రాయిలా తయారైంది చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌ తీరు. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్‌ విచారణ ప్రహసనం వెగటు పుట్టిస్తోంది. కనీస ఆధారాలు లేకుండా బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్‌ రాజ్యాంగేతర శక్తిలా చెలరేగిపోతోంది. ఎంతగా అంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (ప్రసుతం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం)లో విధులు నిర్వహించిన వారందరిపైనా అక్రమ కేసులు బనాయిస్తోంది.

ఎవరు ఏమిటి..? ఎవరి అధికార పరిధి ఏమిటి? అనే విషయాలతో నిమిత్తం లేకుండా అక్రమ కేసులతో వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలపై అక్రమ కేసు నమోదు చేసి వేధించింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించింది. సిట్‌ వేధిస్తోందని ఆయన హైకోర్టును ఆశ్రయించినా సరే టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌లు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆయన్ను ఏకంగా అపహరించుకుపోయి మూడు రోజుల పాటు వేధించి లొంగదీసుకున్నారు.

అసలు నాటి ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం నిమిత్తంలేని అంతర్జాతీయ సిమెంట్‌ దిగ్గజ కంపెనీ వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి వేధించారు. ఎక్సైజ్‌ విధానంతో సంబంధంలేని ఐటీ సలహాదారు రాజ్‌ కేసిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి... ఆయన చెప్పని విష­యాలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం న్యాయస్థానానికి సమర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష గట్టారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా నెలల తరబడి జైలులో రిమాండ్‌లో ఉంచారు. చివరికి సిట్‌ తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి బెయిల్‌ మంజూరు చేసింది. ఏడాదిపాటు సాగించిన ఈ దర్యాప్తు ప్రహసనంతో ఏమీ సాధించలేక సిట్‌ చతికిలబడింది.  

రెండో దశలో పీఏ, అటెండర్‌... తరువాత తోటమాలి, ఫ్లోర్‌ క్లీనర్‌లేనా...! 
చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. దాంతో తీవ్రంగా బెంబేలెత్తిన చంద్రబాబు మరోసారి డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీశారు. టీడీపీ వీర విధేయ సిట్‌ అధికారులకు మళ్లీ పని చెప్పారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్‌ ఆరు నెలల విరామం తరువాత మరోసారి రంగంలోకి దిగింది. ఈసారి వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడింది. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారం చేయించింది.

అంతటితో సిట్‌ కుట్రలు ఆగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో అటెండర్‌ మనోహర్‌కు కూడా సిట్‌ తాజాగా నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. కార్యాలయానికి వచ్చే అతిథులకు టీ, కాఫీలు మాత్రమే అందించే అటెండర్‌కు నోటీసులు జారీ చేయడం ఏమిటని పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు మద్యం విధానంతోగానీ ఆ విధానం అమలుతోగానీ అటెండర్‌కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

కేవలం దర్యాప్తు పేరుతో వేధించేందుకే సిట్‌ ఇంతగా దిగజారుతోందని విశ్లేషిస్తున్నారు. ఇక తరువాత వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పనిచేసే తోటమాలి, ఫ్లోర్‌ క్లీనర్లకు కూడా నోటీసులు జారీ చేస్తారేమోనని ఎద్దేవా చేస్తున్నారు. మద్యం విధానంపై అక్రమ కేసు కేవలం చంద్రబాబు రాజకీయ కక్షసాధింపు మినహా మరొకటి కాదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కక్ష సాధింపు కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలోని సిట్‌ ఇంతగా దిగజారిపోవడం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement