బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్! | Chandrababu government steps up efforts to tie up Geetham University | Sakshi
Sakshi News home page

బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!

Jan 24 2026 4:40 AM | Updated on Jan 24 2026 5:58 AM

Chandrababu government steps up efforts to tie up Geetham University

విశాఖలో రూ.5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి

‘గీతం’ వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కారు పావులు

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని విధంగా భూ దోపిడీ 

బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్‌.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్కారు భూములు మళ్లీ ‘గీతం’ చెరలోకే 

బాలకృష్ణ చిన్న అల్లుడు, నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు నజరానా 

గీతం కబ్జా చేసిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు 

30న జీవీఎంసీ కౌన్సిల్‌ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్‌

గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్సార్‌సీపీ హయాంలో విడిపించిన భూములపై టీడీపీ పెద్దల కన్ను 

ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్ట్‌గేజ్, బ్యాంకు రుణాలిప్పించిన బాబు సర్కారు  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలుచుకుంటే అడ్డేముంది? చంద్రబాబు బరితెగిస్తే తిరుగేముంది? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని విధంగా భూ దోపిడీతో తన సొంత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఇస్తున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ ఖరీదు ఏకంగా రూ.5,000 కోట్లు!! విశాఖలో అత్యంత విలువైన  రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 

విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. 

నాడు గీతం యాజమాన్యం ఆక్రమణల చెర నుంచి విడిపించి విలువైన ప్రభుత్వ భూములను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాపాడితే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని నజరానాగా తమ బంధువులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది. రూ.వేల కోట్ల ఆస్తులకు వారసుడైన ఎంపీ శ్రీభరత్‌.. ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి తన భూ దాహాన్ని తీర్చుకోవడానికే విశాఖ ఎంపీ అవతారమెత్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చివరి సమావేశంలో కుట్రలకు పదును!
బలం లేకపోయినా.. జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని బలవంతంగా లాక్కొన్న టీడీపీ కౌన్సిల్‌కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదునుగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంవో, లోకేశ్‌ పేషీ నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి ధారాదత్తం చేయాలనే కుట్రలకు పదును పెట్టారు. రూ.5,000 కోట్లకు పైగా విలువైన భూముల్ని చివరి సమావేశంలో నారా లోకేశ్‌ తోడల్లుడు ఎంపీ శ్రీభరత్‌కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్‌ భావిస్తోంది. 

ఆక్రమిత భూములేనని తేల్చిన ‘సిట్‌..’
1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి తమ సన్నిహితుల భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గీతం’ ఆక్రమణల పర్వం మొదలైంది. ఒక్కో గజం తమ చెరలోకి తీసుకుంటూ ప్రభుత్వ భూములకు అక్రమాల కంచె వేసింది. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలినేషన్‌ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదు. 

తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ.. విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా ఝుళిపించింది. కబ్జారాయుళ్ల చెరలో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండటానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో.. గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గీతం ఆక్రమించుకున్న భూమిలో 40.51 ఎకరాలకుపైగా దశలవారీగా స్వాధీనం చేసుకున్నారు. గీతం వర్సిటీ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అందులో నిర్మించిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్‌ బండ్‌లను తొలగించారు. 

గీతం యాజమాన్యం కోర్టుని ఆశ్రయించగా స్టేటస్‌ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని నాడు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు అవే భూములను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బాబు సర్కారు సన్నద్ధమైంది.

నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారు?
గీతం యాజమాన్యం భూ కబ్జాలపై అప్పటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ అది భూముల ఆక్రమణే అని స్పష్టం చేశారు. తాను ‘చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (సీసీఎల్‌ఏ) బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గీతం యాజమాన్యం సుమారు 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరిందని, దీనిపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధమని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 

గీతం కోరిన ఆ భూమిని ప్రైవేట్‌ సంస్థకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ఇన్‌కమ్‌ ట్యాక్స్, కస్టమ్స్, సామాజిక సంక్షేమ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్‌ఏ నుంచి ప్రొసీడింగ్స్‌ ఇచ్చామని    తెలిపారు. అయితే తాను పదవీ విరమణ చేసిన తర్వాత నాటి ప్రభుత్వం (టీడీపీ సర్కారు) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. 2014లో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ 2017 మే 15న జీవో నం.165 విడుదల చేశారని చెప్పారు. 

అప్పటికే ఆ ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థలు ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు వాస్తవమేనంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను (కంచె వేయడం, ఆక్రమణల తొలగింపు లాంటివి) ఐవైఆర్‌ సమర్థించారు. ‘ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం సరైన చర్యే’ అని స్పష్టం చేశారు. 

ఊరు పేరు లేని ఉర్సా కోసం..
విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఊరు పేరు లేని ‘ఉర్సా’ లాంటి సంస్థలకు బరి తెగించి అప్పనంగా కట్టబెడుతోంది. ఎకరం కేవలం 99 పైసలకే లీజుకు ఇచ్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతోంది. ఈ విషయం బహిర్గతం కావడంతో జీవోల జారీ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది.

సర్కారు భూములపై ‘గీతం’ లోన్లు.!
ఒకవైపు గీతం ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే గీతం వర్సిటీకి  కేటాయించిన ప్రభుత్వ భూములపై లోన్లు తీసుకునేందుకు గతేడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం కోసం అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుంది. గీతం కోసం గతంలో ఎండాడలోని సర్వే నం. 17/1, 17/28లోని 71.15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూములు 22 ఏ జాబితాలో ఉన్నాయి. 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివీుద బ్యాంకులో లోన్లు తీసుకునేందుకు అడ్డగోలుగా అనుమతించింది. 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను మార్ట్‌గేజ్‌ చేసి.. బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు ఆక్రమిత భూములను సైతం కట్టబెడుతున్నారు.

బడ్డీ కొట్లు తొలగిస్తూ... బడాబాబుకు భూములా?
పొట్ట కూటి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను పోలీస్‌ బలగాలు, పొక్లెయిన్లతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్వాసితులను చేస్తోంది. వీధి వ్యాపారులను కూడా అదే విధంగా తొలగిస్తోంది. మరోవైపు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న బడాబాబుకి మాత్రం దానం చేస్తోంది. రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు ఇంకొక న్యాయం! 

ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తారు? బీఎస్‌వో–24, రెవిన్యూ శాఖ 2012లో జారీ చేసిన జీవో నం.571 ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకూడదు. 

దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావు. ప్రజాస్వామ్య విధానాలకు, చట్టాలకు లోబడి పని చేయాలి. గీతం వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.  – ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement