breaking news
Sribharat
-
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలుచుకుంటే అడ్డేముంది? చంద్రబాబు బరితెగిస్తే తిరుగేముంది? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని విధంగా భూ దోపిడీతో తన సొంత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఇస్తున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఖరీదు ఏకంగా రూ.5,000 కోట్లు!! విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. నాడు గీతం యాజమాన్యం ఆక్రమణల చెర నుంచి విడిపించి విలువైన ప్రభుత్వ భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపాడితే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని నజరానాగా తమ బంధువులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది. రూ.వేల కోట్ల ఆస్తులకు వారసుడైన ఎంపీ శ్రీభరత్.. ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి తన భూ దాహాన్ని తీర్చుకోవడానికే విశాఖ ఎంపీ అవతారమెత్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చివరి సమావేశంలో కుట్రలకు పదును!బలం లేకపోయినా.. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కొన్న టీడీపీ కౌన్సిల్‌కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదునుగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంవో, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి ధారాదత్తం చేయాలనే కుట్రలకు పదును పెట్టారు. రూ.5,000 కోట్లకు పైగా విలువైన భూముల్ని చివరి సమావేశంలో నారా లోకేశ్ తోడల్లుడు ఎంపీ శ్రీభరత్‌కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్ భావిస్తోంది. ఆక్రమిత భూములేనని తేల్చిన ‘సిట్..’1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి తమ సన్నిహితుల భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గీతం’ ఆక్రమణల పర్వం మొదలైంది. ఒక్కో గజం తమ చెరలోకి తీసుకుంటూ ప్రభుత్వ భూములకు అక్రమాల కంచె వేసింది. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ.. విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా ఝుళిపించింది. కబ్జారాయుళ్ల చెరలో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండటానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో.. గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గీతం ఆక్రమించుకున్న భూమిలో 40.51 ఎకరాలకుపైగా దశలవారీగా స్వాధీనం చేసుకున్నారు. గీతం వర్సిటీ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అందులో నిర్మించిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్లను తొలగించారు. గీతం యాజమాన్యం కోర్టుని ఆశ్రయించగా స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని నాడు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు అవే భూములను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బాబు సర్కారు సన్నద్ధమైంది.నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారు?గీతం యాజమాన్యం భూ కబ్జాలపై అప్పటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ అది భూముల ఆక్రమణే అని స్పష్టం చేశారు. తాను ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్’ (సీసీఎల్ఏ) బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గీతం యాజమాన్యం సుమారు 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరిందని, దీనిపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధమని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. గీతం కోరిన ఆ భూమిని ప్రైవేట్ సంస్థకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సామాజిక సంక్షేమ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు. అయితే తాను పదవీ విరమణ చేసిన తర్వాత నాటి ప్రభుత్వం (టీడీపీ సర్కారు) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. 2014లో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ 2017 మే 15న జీవో నం.165 విడుదల చేశారని చెప్పారు. అప్పటికే ఆ ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థలు ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు వాస్తవమేనంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను (కంచె వేయడం, ఆక్రమణల తొలగింపు లాంటివి) ఐవైఆర్ సమర్థించారు. ‘ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం సరైన చర్యే’ అని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని ఉర్సా కోసం..విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఊరు పేరు లేని ‘ఉర్సా’ లాంటి సంస్థలకు బరి తెగించి అప్పనంగా కట్టబెడుతోంది. ఎకరం కేవలం 99 పైసలకే లీజుకు ఇచ్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతోంది. ఈ విషయం బహిర్గతం కావడంతో జీవోల జారీ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది. సర్కారు భూములపై ‘గీతం’ లోన్లు.!ఒకవైపు గీతం ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే గీతం వర్సిటీకి కేటాయించిన ప్రభుత్వ భూములపై లోన్లు తీసుకునేందుకు గతేడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం కోసం అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుంది. గీతం కోసం గతంలో ఎండాడలోని సర్వే నం. 17/1, 17/28లోని 71.15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూములు 22 ఏ జాబితాలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివీుద బ్యాంకులో లోన్లు తీసుకునేందుకు అడ్డగోలుగా అనుమతించింది. 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను మార్ట్గేజ్ చేసి.. బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు ఆక్రమిత భూములను సైతం కట్టబెడుతున్నారు.బడ్డీ కొట్లు తొలగిస్తూ... బడాబాబుకు భూములా?పొట్ట కూటి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను పోలీస్ బలగాలు, పొక్లెయిన్లతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్వాసితులను చేస్తోంది. వీధి వ్యాపారులను కూడా అదే విధంగా తొలగిస్తోంది. మరోవైపు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న బడాబాబుకి మాత్రం దానం చేస్తోంది. రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు ఇంకొక న్యాయం! ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తారు? బీఎస్‌వో–24, రెవిన్యూ శాఖ 2012లో జారీ చేసిన జీవో నం.571 ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావు. ప్రజాస్వామ్య విధానాలకు, చట్టాలకు లోబడి పని చేయాలి. గీతం వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు
అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు సిమాచలం. ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడుచూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు. ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
జూనియర్ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడైన టీడీపీ నాయకుడు శ్రీభరత్ సహా 11 మంది ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డీ ఫాల్టర్ నోటీసు జారీ చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్ వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం తీసుకున్న రుణం ఎగవేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రాబ్యాంక్ పత్రికా ప్రకటన చేసింది. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ.13,65,69,873 (అక్షరాలా పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు) కుటుంబం బాకీ పడిందని పేర్కొంది. సదరు రుణానికి హామీగా ఉంచిన నెల్లిమర్ల, గుర్ల ప్రాంతాల్లోని వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన భూములతో పాటు విశాఖపట్నం మధురవాడలో 47 సెంట్ల భూమిని అక్టోబరు 11న స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా బకాయి మొత్తం చెల్లించి ఈ తనఖా ఆస్తిని విడిపించుకోవాలని పేర్కొంది. వాస్తవంగా ఆంధ్రాబ్యాంకుకు, భరత్‌కు మధ్య జరిగిన నోటీసు వ్యవహారం ఇదే. సహజంగా వ్యాపారస్తులకో.. ఓ మోస్తరు స్థాయి రాజకీయ నేతలకో ఇలాంటి నోటీసులు వస్తే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబుకు తోడల్లుడు, టీడీపీకి ఉత్తరాంధ్ర పెద్దదిక్కుగా వ్యవహరించిన దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనుమడు.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి, ఆర్థికంగా బలవంతుడుగా పేర్కొనే భరత్‌ను డిఫాల్టర్‌గా ఆంధ్రాబ్యాంక్ ప్రకటించడంతో ఒక్కసారి చర్చకు తెరలేచింది. దీనిపై హుందాగా వ్యవహరించాల్సిన భరత్ తాను డిఫాల్టర్ కావడానికి ట్రాన్స్‌కో బకాయిలే కారణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నెపాన్ని సర్కారుపై నెట్టారు. దీంతో చర్చ వివాదాస్పదమైంది. అసలు వాస్తవాలు పరిశీలిస్తే..గత అక్టోబర్ నుంచీ ట్రాన్స్‌కో బకాయిలు..అప్పుడు పాలన ఎవరిది భరత్? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకు సోలార్ పవర్ ప్లాంట్ల యజమానులకు ట్రాన్స్‌కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలి. ఆ మేరకు భరత్‌కు చెందిన వీబీసీ ఎనర్జీ సంస్థకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే గత అక్టోబర్ 18 నుంచి వీబీసీ సంస్థకు బిల్లులు చెల్లించలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు బకాయిలు చెల్లించలేకపోయింది. అంటే మొత్తం తొమ్మిది నెలల కాలంలో టీడీపీ ఏడు నెలలు అధికారంలో కొనసాగగా, చివరి రెండు నెలల కాలంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ భరత్ సోషల్ మీడియాలోనూ, చేసిన ప్రకటనల్లోనూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యాపారస్తులకు బిల్లులు రావడం లేదని, ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. టీడీపీ హయాం నుంచే ట్రాన్స్‌కో నుంచి చెల్లింపులు ఆగాయన్న వాస్తవాన్ని తొక్కి పెట్టి.. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన నిందలు వేయడమే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 3 కోట్లు రావాల్సి ఉందని భరత్ పేర్కొన్నారు. కానీ వాస్తవమేమిటంటే ప్రభుత్వం నుంచి కాదు.. ట్రాన్స్‌కో నుంచి భరత్ రావాల్సిన బకాయిల మొత్తం రూ.2 కోట్ల 52లక్షల 95వేల 540. అంటే.. రూ.47లక్షల మొత్తాన్ని అదనంగా కలిపేసుకుని దాదాపు రూ.3 కోట్లని చెప్పేసుకున్నారు. కొసమెరుపు.. ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో టీడీపీకి భవిష్యత్తులో కూడా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేసిన భరత్‌ను చూసి... ఫరవాలేదు.. కాస్త గట్టోడిలా ఉన్నాడే అన్న అభిప్రాయం క్యాడర్లో కలిగింది. కానీ ఇప్పుడు ఆయన అసంబద్ధమైన వాదనలు, ప్రకటనలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌తో కాదు.. తోడల్లుడు లోకేష్‌బాబుతో పోటీ పడుతున్నట్టు అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వినపడుతోందా భరత్.. ఆ ప్రకారమైతే భరత్‌కు చెల్లించాల్సిందిరూ.96.86 లక్షలే.. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత టీడీపీ సర్కారు నిర్ణయించిన సోలార్ విద్యుత్ కొనుగోలు ధరలు అధికంగా ఉన్నాయని భావించింది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయని తేల్చింది. టీడీపీ ప్రభుత్వం యూనిట్‌కు రూ5.90 చెల్లించగా, అదే యూనిట్ ధర రాజస్థాన్‌లో రూ.2.44 మాత్రమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ల యజమానులకు నోటీసులు జారీ చేయగా.. యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఏపీఈఆర్సీకి హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న యూనిట్ రూ.2.44 ధర ప్రకారం చూస్తే ట్రాన్స్‌కో భరత్ సంస్థకు బకాయి పడిన మొత్తం రూ.96లక్షల85వేల82మాత్రమే. ఏప్రిల్ నుంచి రుణవాయిదాలు చెల్లించని భరత్ ఇక రుణం తీసుకున్న ఆంధ్రా బ్యాంక్‌కు ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలను భరత్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు సాక్షి ప్రతినిధికి చెప్పారు. వరుసగా మూడు నెలలు చూసిన తర్వాత.. నిబంధనల మేరకు కొన్నాళ్ళు చూసి.. ఈ నెలలో స్వాధీనత ప్రకటన వేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే భరత్ మాత్రం ఈ ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్లే బ్యాంకు రుణం చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. వాస్తవానికి భరత్ బ్యాంకు వాయిదాలు కట్టకుండా నిలిపివేసిన ఏప్రిల్‌లో ఏ ప్రభుత్వం ఉందంటే ఎవరినడిగినా చెబుతారు. వాస్తవాలు అలా ఉంటే భరత్ మాత్రం అర్ధం పర్ధం లేని వాదనలతో బుకాయించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ‘అభిమానులూ ఆశీర్వదించండి’ అంటూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కోరారు. తన రెండో కుమార్తె తేజస్విని వివాహం శ్రీభరత్‌తో ఈ నెల 21న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నందమూరి అభిమానులందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు. ఈ మేరకు బాలకృష్ణ తరఫున టీడీపీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.


