సబ్సిడీ విత్తనాల సరఫరాలో చంద్రబాబు సర్కారు విఫలం
విత్తన సరఫరా కోసం కనీసం ప్రణాళిక కూడా సిద్ధం చేయని దుస్థితి
నేటికీ పంపిణీ కాని పచ్చి రొట్ట విత్తనాలు
ఖరారుకాని వేరుశనగ విత్తన టెండర్లు
సబ్సిడీ కోతతో విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పుకునేందుకు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలకు విత్తన భరోసా కరువైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి తొలి ఏడాదిలోనే మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తన పంపిణీలోనూ చేతులెత్తేస్తోంది. సబ్సిడీలో అడ్డగోలుగా కోతలుపెడుతున్న ప్రభుత్వం అదునుకు విత్తన సరఫరా చేయకుండా రైతులను ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేలా చేస్తోంది. ఫలితంగా నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
మరోవైపు విత్తన సరఫరాదారులకు రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం, గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడి తంతుగా మార్చడంతో సబ్సిడీ విత్తన పంపిణీ అగమ్యగోచరంగా తయారైంది. సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు ఒడిగడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సబ్సిడీలో అడ్డగోలు కోత
ముందస్తు ఖరీఫ్‌కు వెళ్తేనే.. పంటల్ని వైపరీత్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు చెబుతుండగా.. ప్రభుత్వం అదునులో విత్తనం సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచగా.. రూ.268 కోట్ల సబ్సిడీతో 5.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేసింది. రబీ 2023–24 సీజన్‌లో జగన్ సర్కారు రూ.131.36 కోట్ల సబ్సిడీతో 3.27 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేస్తే రబీ 2024–25 సీజన్‌లో చంద్రబాబు సర్కార్ కేవలం రూ.51.92 కోట్ల సబ్సిడీతో 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేసింది.
ఖరీఫ్–2025లో 6.32 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా.. కేవలం రూ.163 కోట్ల సబ్సిడీతో 4.23 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. రబీ–2025–26 సీజన్‌లో సబ్సిడీలో మరింత కోత పెట్టడంతో కేవలం రూ.40 కోట్ల సబ్సిడీతో 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు.
అదునుకు అందని విత్తనం
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39 లక్షల ఎకరాల్లో వరి, 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 9.50 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్దేశించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల వారీగా విత్తనాల కోసం ఇండెంట్ సేకరిస్తారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో ఉత్పత్తయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన విత్తనాలకు టెండర్లు పిలుస్తారు. సేకరించిన విత్తనాలను తొలుత ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి సీజన్‌కు ముందుగానే రైతు సేవా కేంద్రా(పూర్వపు ఆర్బీకే)ల్లో అందుబాటులో ఉంచేవారు.
ఏటా ఏప్రిల్‌లో పచ్చి రొట్ట విత్తనాలు, మే 15న వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, జూన్ 15 నుంచి ఇతర విత్తనాలు పంపిణీ చేపడతారు. కానీ.. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో టెండర్లు ఖరారు చేయకపోవడం, అదునుకు విత్తనాలను అందుబాటులో ఉంచలేకపోవడం వంటి కారణాలలో రైతుల్లో అత్యధికులు ప్రైవేటు విత్తన వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేశారు. అవి నాసిరకం కావడంతో పంటలు దెబ్బతిని, ఆశించిన దిగుబడులు రాక నష్టపోయారు. ఖరీఫ్‌లో పచ్చిరొట్ట, వేరుశనగ, రబీలో పప్పు శనగ విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు.
ఖరారు కాని వేరుశనగ టెండర్లు
రానున్న ఖరీఫ్–2026 సీజన్‌లో విత్తన సబ్సిడీని రూ.179 కోట్లకు పరిమితం చేయడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. ఆరి్థక శాఖ విత్తనాలకు సబ్సిడీ అవసరమా అనే ధోరణితో ఉండటంతో అధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌లో ఏటా దాదాపు లక్ష క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచగా.. 2019–24 మధ్య ఐదేళ్లలో ఏటా సగటున 80 వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా రైతులకు సరఫరా చేశారు. అలాంటిది ఖరీఫ్–2025లో అతికష్టంపై 58 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు.
ప్రస్తుత ఖరీఫ్–2026లో 90 వేల టన్నులు అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అందులో కనీసం 50% కూడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆలస్యంగా టెండర్లు ఖరారైనప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో ఆర్‌ఎస్‌కేల్లో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో లేవు. ఈ సీజన్‌లో ఏటా 3.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయగా.. ఇప్పుడు అడ్డగోలు కోతలతో విత్తన సరఫరాను కుదించేస్తున్నారు. ఖరీఫ్–2025లో అతికష్టంపై 1.93 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేయగా.. ఈ ఏడాది 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం టెండర్లు పిలిచారు.
సీమలో వేరుశనగ కనుమరుగు
వేరుశనగ విత్తన సరఫరాలో ప్రభుత్వం కోత పెట్టడం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ అధికంగా సాగవుతుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా సగటున 16 లక్షల నుంచి 18.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేది. గడచిన రెండేళ్లలో సాధారణ సాగులో 50 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. 2024 ఖరీఫ్‌లో 14.80 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 6.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఖరీఫ్–2025లో కేవలం 4 లక్షల ఎకరాల్లోనే సాగైంది. వర్షాభావ పరిస్థితులకు తోడు చంద్రబాబు సర్కారు నిర్వాకమే సాగు తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. సకాలంలో విత్తనాల సరఫరా లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక, వాతావరణం అనుకూలించక వేరుశనగ సాగుకు సీమ రైతులు దూరమయ్యారు.


