బలుసుకు మరో రూ.98.1 కోట్లు | Chandrababu Conspiracy on Power Line Works in Amaravati: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బలుసుకు మరో రూ.98.1 కోట్లు

May 8 2026 5:14 AM | Updated on May 8 2026 5:14 AM

Chandrababu Conspiracy on Power Line Works in Amaravati: Andhra pradesh

220 కేవీ ఈహెచ్‌వీ లైన్‌ను అండర్‌ గ్రౌండ్‌లో వేసే పనుల వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు పెంచుతూ ఈనెల 1న సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులు

అధిక ధరలకు అప్పగించడం ద్వారా ఇప్పటికే రూ.89.19 కోట్లు ప్రయోజనం

మొత్తమ్మీద 220 కేవీ లైన్‌ మార్పు పనుల్లో రూ.187.29 కోట్ల మేర లబ్ధి

రాజధానిలో భూగర్భ విద్యుత్తు లైన్‌ పనుల వ్యయం రూ.1,180.54 కోట్లకు పెంపు  

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనాన్ని చంద్రబాబు  ప్రభుత్వం చేకూర్చింది. 220 కేవీ విద్యుత్‌ లైన్‌ మార్పు పనుల అంచనా వ్యయాన్ని రూ.1,082.44 కోట్ల నుంచి రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌ రూపొందించిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో లోపాల వల్ల ఎన్‌ 10–ఈ1 జంక్షన్‌ నుంచి ఎన్‌ 13–ఈ1 జంక్షన్‌ వరకు 220 కేవీ ఈహెచ్‌వీ(ఎక్స్‌ట్రా హైవోల్టేజ్‌) లైన్‌ను మార్చాల్సి వచ్చింది. 

ఈ లైన్‌ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ విధానంలో ఏర్పాటు పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి గతేడాది సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 8.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఎల్‌–1గా నిలిచింది. 2004 నవంబర్‌ 20న జారీ చేసిన జీవో 133 ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ ఎల్‌–1గా నిలిస్తే ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలి.

కానీ.. బలుసు శ్రీనివాసరావు ముఖ్యనేతకు సన్నిహితుడు కావడం, ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో నిబంధనలను తుంగలో తొక్కి ఆ టెండర్‌ను ఆమోదించారు. ఈ పనులను రూ.1,082.44 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు అప్పగిస్తూ 2025 మార్చి 19న సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల  ఖజానాపై రూ.89.19 కోట్ల భారం పడింది. ఆ మేరకు బలుసుకు ప్రయోజనం చేకూరింది.   

ఆర్‌సీసీ పవర్‌ డక్ట్‌ నిర్మించాలంటూ.. 
చంద్రబాబు సర్కారు అంతటితో ఆగలేదు సరి కదా.. బలుసుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా మరో అడుగు ముందుకేసింది. 220 కేవీ ఈహెచ్‌వీ లైన్‌ ఏర్పాటుకు ఆర్‌సీసీ పవర్‌ డక్ట్‌› నిర్మించాల్సి వచ్చిందని.. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు సవరించాలంటూ సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదించారు. దీన్ని గత నెల 23న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 60వ సమావేశం ఆమోదించింది. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన ప్రతిపాదనను అమలు చేయాలంటూ గత నెల 24న సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు.

దాని ఆధారంగా 220 కేవీ ఈహెచ్‌వీ లైన్‌ మార్పు పనుల వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు అదనంగా మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ విద్యుత్‌ లైన్‌ మారి్పడి పనుల్లోనే బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు రూ.187.29 కోట్ల ప్రయోజనం చేకూరిందని.. ముఖ్యనేతకు బలుసు సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం మోపుతూ సన్నిహితులకు ముఖ్యనేత లబ్ధి చేకూర్చుతున్నారంటూ విద్యుత్‌ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement