బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే

Chandrababu APSSDC Scam Case investigation speed up - Sakshi

అమరావతి కాంట్రాక్టుల తరహాలోనే ‘స్కిల్‌’ స్కామ్‌.. సూత్రధారి చంద్రబాబే  

‘సీమెన్స్‌’కి తెలియకుండా ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మాయ

కాగితాలపై రూ.3,300 కోట్ల ప్రాజెక్టును చూపించి మోసం

ప్రభుత్వ వాటా పేరుతో డిజైన్‌ టెక్‌ కంపెనీకి నిధుల మళ్లింపు 

నకిలీ ఇన్వాయిస్‌లతో డ్రా చేసి పార్థసానికి అందించిన యోగేశ్‌

వాటిని హైదరాబాద్‌కు తరలించి బాబు పీఎస్‌కు అందించిన మనోజ్‌

ఆ కొల్లగొట్టిన నిధులు చివరకు చేరింది చంద్రబాబు నివాసానికే!

మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తా, బాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌లకు సిట్‌ నోటీసులు

విచారణకు హాజరు కావాలని ఆదేశం.. ‘స్కిల్‌’ కుంభకోణం కేసు దర్యాప్తు వేగవంతం 

సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదు­లుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!!  అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్‌ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే.

ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, చంద్రబాబు పీఏస్‌ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్‌ గుప్తా  ఏపీఎస్‌ఎస్‌డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది.

ఇప్పటికే ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది.

బాబు అవినీతి ‘స్కిల్‌’...
టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్‌’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్‌ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి విడుదల చేశారు.

అందులో రూ.241 కోట్లను పలు షెల్‌ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్‌ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

షెల్‌ కంపెనీలు.. బోగస్‌ ఇన్వాయిస్‌లు
టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్‌ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేశ్‌ గుప్తా, చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.

రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్‌ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్‌ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు.

మరోవైపు ఆ షెల్‌ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 

బాబుకు ముడుపులు చేరాయిలా...
అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్‌ గుప్తా, మనోజ్‌ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌ ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ..

► ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్‌ గుప్తా పలు షెల్‌ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్‌ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్‌లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్‌ల ఆధారంగా షెల్‌ కంపెనీలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్‌ అధికారులు ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్‌ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

► నకిలీ ఇన్వాయిస్‌ల ఆధారంగా షెల్‌ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించాడు. 

► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా చివరకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది.

ఆ ముగ్గురికీ సిట్‌ నోటీసులు
ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్‌ గుప్తా, మనోజ్‌ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లకు సిట్‌ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్‌ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్‌ గుప్తా, మనోజ్‌ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top