Vizag Steel: ‘ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లం’.. సాయంత్రానికి ఉల్టా పల్టా! కేంద్ర మంత్రి మాట మార్చడంపై విమర్శలు

Centre to sort out Vizag Steel Plant issues and no plans of privatisation - Sakshi

‘విశాఖ ఉక్కు’పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే 

ఆర్‌ఐఎన్‌ఎల్‌ను బలోపేతం చేసేలా చర్యలు 

ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో పనిచేసే ప్రక్రియపై దృష్టి  

గనుల సమస్యనూ పరిష్కరిస్తామని హామీ  

ఇలా చెప్పలేదంటూ సాయంత్రానికే మాట మార్చిన మంత్రి 

కార్మిక సంఘాల నేతలు మండిపాటు 

దొండపర్తి (విశాఖ దక్షిణ)/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే స్పష్టం చేశారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఐఎన్‌ఎల్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌)ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్‌ పనిచేసే ప్రక్రియపై దృష్టి సారించామని తెలిపారు. గనుల సమస్యనూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు.  

ప్రైవేటీకరణ ఆపడం నా చేతుల్లో లేదు 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్తే కొద్ది గంటల వ్యవధిలోనే మాట మార్చారు. గురువారం సాయంత్రం ఆయన నోవోటెల్‌లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.

అనంతరం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సి.హెచ్‌.నరసింగరావులు మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చామన్నారు.

సింగరేణిలో ఆంధ్ర వాటా తేల్చండి  
బీఆర్‌ఎస్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌ అన్నారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్‌ఎస్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలన్నారు. అలాగే స్టీల్‌ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు.  

స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు గనులు కేటాయించాలి  
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని, గనుల కేటాయింపు విషయం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తామని మంత్రి చెప్పారని తెలిపారు.

ప్రైవేటీకరణపై కేంద్రం కాస్తా వెన­క్కు తగ్గినట్లే కనిపిస్తోందని చెప్పారు. ప్లాంట్‌ లాభాల కోసం మాట్లాడుతుండటం శుభపరిణామమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని, సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తామని ముందుకు వస్తే ప్లాంట్‌ కొనటానికి వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. బీజేపీతో గొడవ ఉంటే వారితో నేరుగా తేల్చుకోవాలని, స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top