AP: రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం: కేంద్రం | Sakshi
Sakshi News home page

AP: రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం: కేంద్రం

Published Sat, Dec 11 2021 5:11 AM

Central Government Assurance To YSRCP MPs For South Coast Railway Zone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తెలిపారు. కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.4,157 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు.   

పీజీ వైద్యుల కొరతను పరిష్కరించాలి 
కాగా, పీజీ మెడికల్‌కు సంబంధించి భారత్, నేపాల్‌ మధ్య ఎంవోయూ కుదిరితే దేశంలో పీజీ వైద్యుల కొరత చాలా వరకు పరిష్కారమవుతుందని మిథున్‌రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. శుక్రవారం వారిద్దరూ కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయను కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. ఎరువుల కేటాయింపులు  ఏపీ రైతుల అవసరాలకు సరిపోవట్లేదని, అందువల్ల ఏపీకి కేటాయింపులు పెంచాలని విన్నవించారు.  

వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పరిష్కారం కనుగొనాలి 
రాజ్యసభలో విజయసాయిరెడ్డి 
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం శాస్త్రీయ పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. వాయు కాలుష్యంపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ సభ్యుల తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో రెండు దశాబ్దాలుగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోందన్నారు. ఇందుకు దారి తీస్తున్న కారణాలేమిటో విశ్లేషించాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో క్లీన్‌ ఎయిర్‌ ఏపీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో 2024 నాటికి రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా 60 వేల ఉద్యోగాల కల్పనతోపాటు ఏటా 10 లక్షల విద్యుత్‌ వాహనాల తయారీకి ప్రణాళిక చేసిందన్నారు. కాగా, హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన బిపిన్‌ రావత్‌ దంపతులకు విజయసాయిరెడ్డి, ఎంపీ వంగా గీత ఘన నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని కామ్‌రాజ్‌ మార్గ్‌లో ఉంచిన బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాల వద్ద శుక్రవారం పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement