లాభాల్లో ఉన్నా అమ్మేశారు | Center agreement for sale of Ferro Scrap Nigam Ltd: Andhra pradesh | Sakshi
Sakshi News home page

లాభాల్లో ఉన్నా అమ్మేశారు

Sep 22 2024 4:43 AM | Updated on Sep 22 2024 4:43 AM

Center agreement for sale of Ferro Scrap Nigam Ltd: Andhra pradesh

ఫెర్రో స్క్రాప్‌ నిగం లిమిటెడ్‌ విక్రయానికి కేంద్రం ఒప్పందం 

మరో రెండేళ్ల పాటు రూ.1,000 కోట్ల ఆర్డర్‌ ఉన్న సంస్థ విక్రయం 

ఏడాదికి రూ.100 కోట్లు లాభం.. రూ.175 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 

న్యాయపోరాటం చేస్తామంటున్న ఉద్యోగులు, కార్మికులు

ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. కార్మిక, ఉద్యోగ సంఘాల ఆందోళనలను పట్టించుకోకుండా ఉక్కు పరిశ్రమను ›ప్రైవేట్‌పరం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూతబడినా, ఆస్తులను వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ చేపట్టినా, కొత్త ఆర్డర్లు తీసుకోకుండా నియంత్రిస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు శాఖ ఆధ్వర్యంలో లాభాల్లో ఉన్న ఫెర్రో స్క్రాప్‌ నిగం లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌) విక్రయానికి పూనుకుంది. ఈమేరకు జపాన్‌ సంస్థతో ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. 

లాభాల్లో ఉన్న సంస్థను..
నష్టాల నెపంతో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సిద్ధమైన కేంద్రం లాభాల్లో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను సైతం విడిచిపెట్టడం లేదు. లాభాల్లో ఉండటమే కాకుండా రెండేళ్ల పాటు రూ.1,000 కోట్లు ఆర్డర్‌ ఉన్న సంస్థను ప్రైవేట్‌కు అప్పగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఉక్కు శా«ఖ ఆధ్వర్యంలో భిలాయ్‌ ప్రధాన కేంద్రంగా 1979లో ఫెర్రో స్క్రాప్‌ నిగం లిమిటెడ్‌ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 10 యూనిట్లు కలిగిన ఈ సంస్థలో 445 మంది శాశ్వత ఉద్యోగులు, 2,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికు­లున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇస్కో బర్న్‌పూర్, దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్, నగర్‌నార్, సేలం, బొకారో స్టీల్‌ప్లాంట్లతో పాటు హైదరాబాద్‌లోని మిథాని, హరిద్వార్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో ఈ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ ఆ సంస్థలలోని స్క్రాప్‌ను సేకరించి వాటి అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసి అందిస్తుంది.

రూ.320 కోట్లకు జపాన్‌ కంపెనీకి విక్రయం
ఏడాదికి రూ.వంద కోట్ల లాభంతో పాటు డిపాజిట్లు, నిల్వలు భారీగా ఉన్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ను కేంద్రం కారుచౌకగా జపాన్‌కు చెందిన మెసర్స్‌ కొనోయ్‌కి ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్ధకు రూ.320 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. లాభాలను ఆర్జిస్తున్న సంస్థను విక్రయించడమే కాకుండా కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను కూడా కారుచౌకగా ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది.

న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు
కేంద్ర నిర్ణయం పట్ల ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. పరిశ్రమలను అమ్ముకుంటూ పోతున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లో ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పబడుతున్నారు. నష్టాలను అధిగమించడానికి రూ.2 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

రూ.వెయ్యి కోట్ల ఆర్డర్‌ ఉన్నా..
ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ ఏడాదికి రూ.100 కోట్లు లాభం ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.175 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.36 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లకు రూ.1000 కోట్ల ఆర్డర్‌ కూడా ఉంది. ఈ సంస్థకు స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రూ.80 కోట్లు, ఇతర ప్లాంట్ల నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇంత ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థపై కేంద్రం కన్ను పడింది. 2016లో ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేయడంతో సంస్ధ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.

దుర్మార్గ చర్య
మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న కంపెనీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఈ సంస్థను అమ్మేస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –పి.రాములు, అధ్యక్షుడు, ఫెర్రోస్క్రాప్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 

లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారు
ఫెర్రోస్క్రాప్‌ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్‌లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవ­లం రూ.320 కోట్లు కోసం ఇలా చేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – ఎం.అమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఫెర్రోస్క్రాప్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement