breaking news
ferro industries
-
లాభాల్లో ఉన్నా అమ్మేశారు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. కార్మిక, ఉద్యోగ సంఘాల ఆందోళనలను పట్టించుకోకుండా ఉక్కు పరిశ్రమను ›ప్రైవేట్‌పరం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతబడినా, ఆస్తులను వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ చేపట్టినా, కొత్త ఆర్డర్లు తీసుకోకుండా నియంత్రిస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు శాఖ ఆధ్వర్యంలో లాభాల్లో ఉన్న ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్) విక్రయానికి పూనుకుంది. ఈమేరకు జపాన్ సంస్థతో ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. లాభాల్లో ఉన్న సంస్థను..నష్టాల నెపంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమైన కేంద్రం లాభాల్లో ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ సంస్థను సైతం విడిచిపెట్టడం లేదు. లాభాల్లో ఉండటమే కాకుండా రెండేళ్ల పాటు రూ.1,000 కోట్లు ఆర్డర్ ఉన్న సంస్థను ప్రైవేట్‌కు అప్పగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఉక్కు శా«ఖ ఆధ్వర్యంలో భిలాయ్ ప్రధాన కేంద్రంగా 1979లో ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 10 యూనిట్లు కలిగిన ఈ సంస్థలో 445 మంది శాశ్వత ఉద్యోగులు, 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇస్కో బర్న్‌పూర్, దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్, నగర్నార్, సేలం, బొకారో స్టీల్ప్లాంట్లతో పాటు హైదరాబాద్‌లోని మిథాని, హరిద్వార్‌లోని బీహెచ్ఈఎల్లో ఈ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎన్ఎల్ ఆ సంస్థలలోని స్క్రాప్‌ను సేకరించి వాటి అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసి అందిస్తుంది.రూ.320 కోట్లకు జపాన్ కంపెనీకి విక్రయంఏడాదికి రూ.వంద కోట్ల లాభంతో పాటు డిపాజిట్లు, నిల్వలు భారీగా ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ను కేంద్రం కారుచౌకగా జపాన్‌కు చెందిన మెసర్స్ కొనోయ్కి ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధకు రూ.320 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. లాభాలను ఆర్జిస్తున్న సంస్థను విక్రయించడమే కాకుండా కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను కూడా కారుచౌకగా ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది.న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగులుకేంద్ర నిర్ణయం పట్ల ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. పరిశ్రమలను అమ్ముకుంటూ పోతున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పబడుతున్నారు. నష్టాలను అధిగమించడానికి రూ.2 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.రూ.వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా..ఎఫ్ఎస్ఎన్ఎల్ ఏడాదికి రూ.100 కోట్లు లాభం ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.175 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.36 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లకు రూ.1000 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఈ సంస్థకు స్టీల్ ప్లాంట్ నుంచి రూ.80 కోట్లు, ఇతర ప్లాంట్ల నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇంత ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థపై కేంద్రం కన్ను పడింది. 2016లో ఎఫ్ఎస్ఎన్ఎల్ను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేయడంతో సంస్ధ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.దుర్మార్గ చర్యమూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న కంపెనీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఈ సంస్థను అమ్మేస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –పి.రాములు, అధ్యక్షుడు, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయీస్ యూనియన్ లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారుఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలా చేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – ఎం.అమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ -
మంత్రి ఇలాకాలో కార్మికుల ‘ఆకలి కేకలు’
మెరకముడిదాం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సొంత ఇలాకాలో ఉన్న రెండు ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మెరకముడిదాం మండలం గర్భాం సమీపంలో ఉన్న ఆంధ్రా ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకూ కార్మికులు విధులకు హాజరుకావొద్దని యాజమాన్యం ప్రకటించింది. దీన్ని కార్మికులు వ్యతిరేకించారు. ఈ దశలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. పరిశ్రమకు వారం రోజుల్లో విద్యుత్ సరఫరా వచ్చినా , లేకపోయినా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ఒప్పుకుంది. దీనికి కార్మికులు కూడా సరేననడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు జరిగిన రెండో రోజునే పరిశ్రమకు విద్యుత్ సరాఫరా రావడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి రావాలని కోరింది. అయితే తాము విధులకు హాజరుకాని రోజులకు కూడా వేతనం చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, లేదంటే హాజరుకామని కార్మికులు మొండికేశారు. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అనంతరం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలకపోవడంతో యాజమాన్యం ఈ నెల 8వ తేదీన లాకౌట్ ప్రకటించింది. అలాగే మరోవైపు గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమ మూతపడి 9 నెలలు కావస్తోంది. ఈ విషయాన్ని కార్మికులు పలుమార్లు మంత్రి మృణాళిని దృష్టికి, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ పరిశ్రమలు తెరిచే పరిస్థితి కానరాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇలాకాలోని పరిశ్రమలు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రి మృణాళిని కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.