ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్‌ కలిశాయా?  | Sakshi
Sakshi News home page

ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్‌ కలిశాయా? 

Published Thu, Mar 28 2024 4:53 AM

CBI is inquiring about the traveling map from Brazil - Sakshi

బ్రెజిల్‌ నుంచి ట్రావెలింగ్‌ మ్యాప్‌పై ఆరా తీస్తున్న సీబీఐ 

రెండు రోజులు ఆలస్యంగా ఎందుకొచ్చింది? 

కొలంబో మార్గంలో ఏమైనా సీల్‌ టాంపరింగ్‌ జరిగిందా? 

సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్‌ డేటా క్షుణ్ణంగా పరిశీలన 

సంస్థ దిగుమతి చేసుకున్న ఫీడ్‌ ఫైల్స్‌ వివరాల సేకరణ

సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్‌ రాకెట్‌ చిక్కుముడి­ని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్‌ శాంటోస్‌ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్‌ మ్యాప్‌ వివరాలను పిన్‌ టు పిన్‌ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది.

రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యా­ప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్‌ నుంచి డ్రైఈస్ట్‌ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది.  

పది రోజుల ప్రయాణం.. 
అసలు ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్‌ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్‌ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్‌ షిప్‌ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్‌ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. 

ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? 
ఓషన్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్‌తో కూడిన కంటైనర్‌ కార్గో జిన్‌ లియాన్‌ యంగ్‌ గ్యాంగ్‌ కార్గో షిప్‌ హెచ్‌హెచ్‌ఎల్‌ఏ కంటైనర్‌ టెర్మినల్‌ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్‌ ప్రకా­రం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్‌ టెర్మినల్‌కు, ఆ తర్వాత సూయజ్‌ కెనాల్‌లో బెర్తింగ్‌ కావాల్సి ఉంది.

అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్‌ కాలింగ్‌’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌ గేట్‌వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్‌ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్‌లోని సీఎన్‌ఎం టెర్మినల్‌కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది.

అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చే­రు­­కోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌లోని టెర్మినల్‌–2కి 16వ­తేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్‌ ఇచ్చారు.  

కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. 
కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్‌ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్‌ టాంపరింగ్‌ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

బ్రెజిల్‌కు బృందాలు..  
సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్‌డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్‌ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్‌ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్‌లో డ్రైఈస్ట్‌ ఆర్డర్‌ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్‌ బెర్తింగ్‌ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు.

ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్‌ అవశేషాలతో వచ్చిన కంటైనర్‌ని విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌లోనే భద్రపరిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement