ఏప్రిల్‌ నాటికి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ | Buggana Rajendranath comments in Legislative Council | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నాటికి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

Mar 17 2022 3:43 AM | Updated on Mar 17 2022 2:53 PM

Buggana Rajendranath comments in Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులన్నింటినీ ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో బుధవారం ప్రకటించారు. గ్రాట్యుటీ, జీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, ఇతర పింఛను ప్రయోజనాలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి బకాయిలు లేవని, నిర్ధిష్ట సమయంలోనే వాటి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రావిడెంట్‌ ఫండ్, లీవ్‌  ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లింపులలో కొంత జాప్యం చోటు చేసుకుంటుందని చెప్పారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని, ఏప్రిల్‌ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 

ఎగుమతుల్లో పురోభివృద్ధి
ఎగుమతుల విషయంలో మన రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకినట్టు మంత్రి బుగ్గన శాసనమండలిలో తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,829 కోట్లు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,745 కోట్లు, 2021 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 7 నెలల కాలంలో రూ.1,69,404 కోట్లు విలువైన ఎగుమతులు రాష్ట్రం నుంచి జరిగాయని వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement