
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
19 ఏళ్ల విద్యార్థితో 38 ఏళ్ల మహిళ ప్రేమాయణం
పెళ్లికి సమాజం అంగీకరించదని బెంగళూరు వెళ్లిపోయిన ప్రేమికులు
చిత్తూరు అర్బన్: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్‌గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.
కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది.