బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పే చట్టవిరుద్ధం | Sakshi
Sakshi News home page

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పే చట్టవిరుద్ధం

Published Mon, Dec 13 2021 5:15 AM

Brijesh Kumar Tribunal Ruling Is Illegal Says Four States - Sakshi

సాక్షి, అమరావతి: బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమలుపై కృష్ణా బేసిన్‌ (పరీవాహక ప్రాంతం)లోని నాలుగు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆ తీర్పు చట్టవిరుద్దమని, దాన్ని అమలు చేయవద్దని ఏపీ, తెలంగాణ వాదిస్తుండగా.. తక్షణమే అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర కోరుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 రాష్ట్రాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించాయి. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా బలమైన వాదనలను వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
 
చట్టాన్ని ఉల్లంఘించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌: ఆంధ్రప్రదేశ్‌  

 కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–1) ఇచ్చిన తీర్పును అమలుచేస్తూ 1976 మే 31న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.  
 అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) చట్టం–1956ను 2002లో కేంద్రం సవరించింది. సవరించిన సెక్షన్‌–4(2) ప్రకారం 2002కు ముందు నదీజల వివాదాలను పరిష్కరిస్తూ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించకూడదు. సెక్షన్‌–6(2) ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సమీక్షించింది. ఇది చట్టవిరుద్ధం. 
బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా క్యారీ ఓవర్‌ కింద మా రాష్ట్రానికి 150 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేశాక క్యారీ ఓవర్‌ కింద 30 టీఎంసీలు, 50% నీటి లభ్యత ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత క్యారీ ఓవర్‌ కింద 120 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఈ పద్ధతిలో క్యారీ ఓవర్‌ కింద నీటి వినియోగం అసాధ్యం. దీన్ని మార్చాలి.  
♦ 75%, 65% లభ్యత మధ్య ఉన్న జలాలు, 50% లభ్యత ఆధారంగా మిగులు జలాలు వెరసి 448 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువనున్న రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ పంపిణీ చేసింది. వీటి ఆధారంగా కర్ణాటక సర్కార్‌కు ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడం, అదనంగా 100 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం రావడంలో తీవ్రజాప్యం జరుగుతుంది. ఇది బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఏపీకి శరాఘాతమే. 
తుంగభద్ర సబ్‌ బేసిన్‌ (కే–8)లో 65% లభ్యత ఆధారంగా 36 టీఎంసీలను ట్రిబ్యునల్‌ కేటాయిస్తే.. 12.24 టీఎంసీలు వాడుకునేలా అప్పర్‌ తుంగ, 18.55 టీఎంసీలు వినియోగించుకునేలా సింగటలూరును కర్ణాటక నిర్మించింది. 9 టీఎంసీల కేటాయింపు ఉన్న అప్పర్‌ భద్రను 29.90 టీఎంసీలు వాడుకునేలా చేపట్టింది. 
 బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి రాకముందే అక్రమంగా 300 టీఎంసీలు వాడుకునేలా కర్ణాటక, 90 టీఎంసీలు వాడుకునేలా మహారాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టాయి.  
 ఏపీ, తెలంగాణల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు (చిన్న నీటివనరులను మినహాయించి) 75% నీటి లభ్యత ఆధారంగా 641.74 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. కానీ.. 2014–15 నుంచి 2017–18 వరకు సగటున 481 టీఎంసీలే ఈ ప్రాజెక్టులకు వచ్చాయి. 
 వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిని వాడుకోవడానికి వీలుగా తక్షణమే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయాలని కర్ణాటక సర్కారు చేస్తున్న వాదనలు అన్యాయం. 
 చట్టవిరుద్ధంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ పంపిణీ చేసిన జలాల్లో మార్పులు చేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీకి న్యాయం చేయాలి. ఏపీకి న్యాయం చేసే వరకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయకూడదు. 

తీర్పును అమలు చేయవద్దు: తెలంగాణ 
బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయవద్దు. ఈ తీర్పును అమలు చేస్తే బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన క్యారీ ఓవర్‌ జలాలను మా రాష్ట్రం వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ట్రిబ్యునల్‌ తీర్పులో మార్పులు చేయాలి. అప్పటిదాకా ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయకూడదు. 

తక్షణం అమలు చేస్తేనే ఉపయోగం: కర్ణాటక 
బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2013 నవంబర్‌ 19న తుది తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్లయినా ఆ తీర్పు అమల్లోకి రావడం లేదు. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు వృథాగా కడలిపాలవుతున్నాయి. వాటిని వాడుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.13,321 కోట్లు ఖర్చుచేశాం. తక్షణమే తీర్పు అమలు చేస్తే ప్రాజెక్టులను పూర్తిచేసి, కేటాయించిన నీటిని వాడుకుంటాం. దీనివల్ల ఏపీ, తెలంగాణలకు నష్టం ఉండదు. 

నోటిఫై చేయాల్సిందే: మహారాష్ట్ర 
బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు ఇచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పటిదాకా అమలు చేయకపోవడం అన్యాయం. తక్షణమే తీర్పును అమలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలి. దీనివల్ల నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది.    

Advertisement
 
Advertisement
 
Advertisement