
ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నారేమో?
సామాన్యుడికి వీటిపై అవగాహనఉండదనుకుంటున్నారా!?
సూపర్ సిక్స్‌లో చెప్పిన ఆడబిడ్డ నిధి అమలు చేశారా?
‘మండలి’లో సూపర్ సిక్స్‌పై చర్చలో ప్రభుత్వాన్ని కడిగేసిన ప్రతిపక్ష నేత బొత్స, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లిందంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలపై గురువారం వాయిదా పడిన చర్చ శుక్రవారం కొనసాగింది. బొత్స మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటోంది.
మాకు తెలిసిన తెలుగు భాష ప్రకారం.. హామీ ఇచ్చిన ఆరు పథకాలు అమలుచేశాక అప్పుడు సక్సెస్ అయినట్లు లెక్క. మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారంటే.. ప్రజలందరూ చెవిలో పవ్వు పెట్టుకుని ఉన్నారనుకుంటున్నారేమో! సామాన్యుడికి ఆ విషయం కూడా అవగాహన ఉండదని అనుకుంటున్నారా?’.. అంటూ తూర్పారబట్టారు.
చర్చలో తమ పార్టీ ఎమ్మెల్సీలు సూపర్ సిక్స్‌లో చెప్పిన ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పథకాల అమలు గురించి అడుగుతుంటే మంత్రులు సహనం కోల్పోతున్నారంటూ ఆక్షేపించారు. ఉన్న విషయాలు చెబితే వారికెందుకు అసహనం వస్తోందో అర్ధంకావడంలేదన్నారు. ఇక సూపర్ సిక్స్ పథకాలు అమలుచేసిన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలని మంత్రులు అంటున్నారని.. అయితే, ‘ఏ ప్రభుత్వానికి సిగ్గు ఉందో, ఏ నాయకుడికి సిగ్గు ఉందో, ఎవరు సిగ్గుమాలి ఉన్నారో.. ఎవరు మాట తప్పారో ప్రజలకు తెలుసు’ అంటూ బొత్స వ్యాఖ్యానించారు.
బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు..
అచ్చెన్నాయడు: సూపర్ సిక్స్ సూపర్‌హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్. మేం ఇచ్చిన పథకాలు, ఇచ్చిన హామీలు అమలుచేశాం కాబట్టే, మొన్న ఒక సంవత్సరం తర్వాత మీ నాయకుడి జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే, ప్రజలు వన్‌సైడ్‌గా మీకు డిపాజిట్లు రాకుండా చేశారంటే మేం ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామనే.
బొత్స: మంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్ధంకావడం లేదు. రెండు జెడ్పీటీసీ గెలిచామంటున్నారు. మీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం మున్సిపాలిటీ కూడా మేం గెలిచాం. గుర్తు తెచ్చుకోండి. మర్చిపోకండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే. అది కూడా గెలిచాం.
బొత్స: ఎన్నికల్లో మీరు హామీలిచ్చిన 20 లక్షల ఉద్యోగాలు గురించి మేం మాట్లాడితే.. మంత్రులు నిన్న జరిగిన డీఎస్సీ ఉద్యోగాల సభ గురించి మాట్లాడుతున్నారు. డీఎస్సీలో 15 వేల ఉద్యోగాలిచ్చారు. అదే మొదటి 15 నెలల్లో మా ప్రభుత్వం 1.50 లక్షల ఉద్యోగాలిచ్చింది.
అచ్చెన్నాయుడు: లక్షా యాభై వేల ఉద్యోగాలిచ్చారంటున్నారు. వాళ్ల కార్యకర్తలకు వలంటీర్లు ఉద్యోగాలిచ్చారు.
బొత్స: ఏ ఉద్యోగమిచ్చామో.. ఏం అంశంపై మాట్లాడుతున్నారో తెలియకపోతే ఎలా? మేం ఇచ్చామన్న లక్షా 50 వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే. సచివాలయ ఉద్యోగులందరూ మా కార్యకర్తలా?
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్
టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పే సూపర్ సిక్స్ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన అమ్మఒడి పథకం కాపీనే తల్లికి వందనమని మేం అంటే.. కాదు, లోకేశ్ మదిలోంచి వచ్చిన పథకం తల్లికి వందనం అని టీడీపీ అంటోంది. మరి తల్లికి వందనంలో కోతలు పెట్టారేంటి అంటే.. లేదు జగన్ ప్రభుత్వం నిబంధనలే అమలుచేశామంటున్నారు. దీంతోనే అది కాపీ పథకమని అర్ధంకావడంలేదా.
రాష్ట్ర సంపద పెంచుతామని చంద్రబాబు అన్నారు.. తీరా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ అమలుచేయమంటే, రాష్ట్ర ఖజానా చూస్తే భయమేస్తోందంటున్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెస్తే, వాటిని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి సంపద కాదా? జగన్ తెచ్చిన సంపదను ఎలా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారు? – ఇజ్రాయెల్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
అరోగ్యశ్రీ నీరుగార్చారు.. రైతులకు గిట్టుబాటు ధరలేదు..
కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్‌తో సహా 143 హామీలిచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉద్యోగులకు ఐఆర్ లేదు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం నీరుగార్చారు. రాష్ట్రంలో రైతులందరూ గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందిపడుతున్నారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.వేల కోట్ల భారం వేశారు. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
జోలి పట్టుకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి..
సూపర్ సిక్స్‌లో ఇంకా అమలుచేయని పథకాలకు ప్రభుత్వం పీ–4 చూపిస్తోంది. జోలి పట్టుకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏ ప్రభుత్వం చేయదు. చదివింపుల పుస్తకం పెట్టి, ఆ చదివింపులతో శుభ కార్యక్రమం చేయడం అన్యాయం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త వృద్ధాప్య పింఛన్లు మంజూరుకాలేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు పాలనలో అర్హులకు ఎప్పుడూ సంపూర్ణ న్యాయం జరగలేదు. అదే 2019–24 మధ్య జగన్ ప్రభుత్వం సంతృప్తస్థాయిలో పథకాలను అమలుచేసింది. – విక్రాంత్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
హామీలు అమలుచేయకుండా సంబరాలా?
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలపై టీడీపీ కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చారు. హామీలు అమలుచేయకుండా అన్ని వర్గాల వారికీ ఎగనామం పెట్టి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం ఏంటి? ప్రతీ నిరుద్యోగికీ ఇప్పటికే ప్రభుత్వం భృతి కింద రూ.45 వేలు చొప్పున ఎగనామం పెట్టింది. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నారు.
15 నెలల పాలనలో ఒక్క ఆడబిడ్డకూ రూ.15 కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అమలైన పథకాలనూ ఆపేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇది మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోరమైన మోసం. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనంగా మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కోతలు పెట్టారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ
పని మనుషులు దొరకడం లేదు..
అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడపటం ఎలా సాధ్యపడుతుంది? ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా అమలుచేసింది. ఇంకా ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. మన దగ్గర రూ.నాలుగు వేలు ఇస్తుంటే, బిహార్‌లో రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రూ. నాలుగు వేలు ఇస్తుంటేనే మన దగ్గర పనిమనుషులు దొరకడంలేదు. దీంతో బిహార్ నుంచి ఇక్కడికి పనిచేయడానికి వస్తున్నారు. ఇంకా ఇచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? – సోము వీర్రాజు, ఎమ్మెల్సీ బీజేపీ
లబ్ధిదారులు 2 లక్షల మంది తగ్గారు..
ఇటీవల రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందించాం. మేం 47 లక్షల మందికే ఇచ్చాం. అయితే గత ప్రభుత్వంలో 52 లక్షల మందికి రైతుభరోసా ఇచ్చారు కదా అని విమర్శలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఇచ్చిన 52 లక్షల మంది వివరాలు పరిశీలించాం. ఈ క్రమంలో లబ్ధిదారులు రెండు లక్షల మంది తగ్గినట్లు తేలింది. – అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి
ఉచిత సిలిండర్లు మూడు విడతలు ఇచ్చాం
ఇప్పటివరకు దీపం పథకం కింద మూడు విడతలుగా ఉచిత సిలిండర్లు అందించాం. ఇలా 2.55 లక్షల సిలిండర్లు డెలివరీ చేశాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పథకం అమలుచేస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ ద్వారా పథకం అమలుకు ప్రయోగం చేస్తున్నాం. – నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఆడబిడ్డ నిధిపై అధ్యయనం..
ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎలా అమలుచేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. భవిష్యత్తులో పూర్తి విధివిధానాలు ప్రకటిస్తాం. – కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ మంత్రి
15 నెలల్లో 5.5 లక్షల ఉద్యోగావకాశాలు
15 నెలల పాలనలో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 5.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇంకో మూడున్నరేళ్లు ఉంది. కేబినెట్‌లో ఆమోదం ప్రకారం మరో 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ లెక్కన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సులువుగా ఇచ్చేస్తాం. – భరత్, పరిశ్రమల శాఖ మంత్రి