విశాఖలో కొండల విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి ఫైర్
ఎంవీపీ కాలనీ (విశాఖ): విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయిందని జనసేన మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేస్తే విధ్వంసం, టీడీపీ చేస్తే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతోందన్నారు.
దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కట్టడాల కోసం రుషికొండపై నిర్మాణాలు చేస్తే టీడీపీ నానాయాగి చేసిందని.. రుషికొండను బోడిగుండు చేసేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిందన్నారు.
అయితే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో శ్రీ వరాహ నృసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కొట్టేస్తూ అభివృద్ధి అని చెబుతోందన్నారు. విశాఖకు రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేయడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిందన్నారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపేందుకు అవసరమైతే నగర ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.


