‘కృష్ణా’లో బోటింగ్‌ బంద్‌

Boating activities of Tourism Department in Vijayawada been closed - Sakshi

భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్‌ కార్యకలాపాలు మళ్లీ బంద్‌ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్‌ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్‌ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్‌ పాయింట్‌ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top