
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన ఆహార పంట వరి ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణానికి మించి సాగైంది. ఖరీఫ్‌లో వరి సాగు సగటు విస్తీర్ణం 4.03 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.20కోట్ల హెక్టార్లలో సాగైంది. గత ఏడాది ఇదే సమయంలో 3.90 కోట్ల హెక్టార్లలో మాత్రమే వరి సాగయ్యింది. అంటే దాదాపు 8 శాతం పెరుగుదల నమోదయిందని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఒడిశా, పశి్చమ బెంగాల్, బిహార్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వర్షపాతం అనుకూలంగా ఉండటం, కనీస మద్దతు ధర హామీ, ప్రభుత్వ కొనుగోలు విధానాలు రైతుల ఉత్సాహానికి కారణమయ్యాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 10.74కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. ఇది గతేడాది ఇదే సమయంలో ఉన్న 10.38కోట్ల హెక్టార్ల కంటే ఎక్కువ. అంటే మొత్తమ్మీద 3% పెరుగుదలతో 0.35 కోట్ల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. పంటల వారీగా చూస్తే వరి, మొక్కజొన్న పంటలు విస్తీర్ణం పెరగ్గా, సోయా, పత్తి సాగు తగ్గుదలను నమోదు చేసుకున్నాయి.
పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన సోయాబీన్
ఈ ఏడాది మొక్కజొన్న సాగు గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి 93.34 లక్షల హెక్టార్లకు చేరింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం పెరుగుదల గణనీయంగా నమోదైంది. తక్కువ పెట్టుబడి ఖర్చులు, వర్షాభావానికి తట్టుకునే లక్షణం, పశుగ్రాసం, స్టార్చ్, బయోఫ్యూయెల్స్ పరిశ్రమల్లో పెరుగుతున్న డిమాండ్ ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు.
రాగి, ఇతర చిరు ధాన్యాల సాగు కూడా 10% పైగా పెరుగుదల చూపించాయి. అదే సమయంలో సోయాబీన్ సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 1.24కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి 1.20 కోట్ల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. అంటే 4.77 లక్షల హెక్టార్లలో సాగు తగ్గింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రైతులు స్థిరమైన ఆదాయం కోసం సోయా నుంచి మొక్కజొన్నకు మారినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
దీనివల్ల దేశీయ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా పప్పుధాన్యాల విస్తీర్ణంలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ ఏడాది 1.12 కోట్ల హెక్టార్లలో సాగవగా, గత ఏడాది ఇది 1.11 కోట్ల హెక్టార్లలో సాగింది. అందులో మినుము 7% పెరిగి 0.21 కోట్ల హెక్టార్లు చేరుకుంది. అయితే కందుల సాగు 2% మేరకు తగ్గింది.
పత్తి సాగుకు వెనుకడుగు
కీలక వాణిజ్య పంట అయిన పత్తి ఈ సీజన్‌లో క్షీణతను చవిచూసింది. 2024లో 1.11కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి 1.08 కోట్ల హెక్టార్లలో మాత్రమే రైతులు వేశారు. అంటే 2.92 లక్షల హెక్టార్లు తగ్గింది. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షపాతం లోటు, అధిక ఇన్పుట్ ఖర్చులు, పురుగుల బెడద, అలాగే బియ్యం, మొక్కజొన్న వంటి పంటల నుంచి వచ్చే మెరుగైన ఆదాయం దీనికి కారణమని అధికారులు విశ్లేíÙస్తున్నారు. పత్తి తగ్గుదల వల్ల దేశీయ వస్త్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణుల అభిప్రాయం.
నూనెగింజలు తగ్గుదల
నూనెగింజల విస్తీర్ణం మాత్రం తగ్గింది. గతేడాది 1.87 కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి అది 1.82కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ముఖ్యంగా సోయా 4% తగ్గగా, నువ్వులు 6%, సన్ ఫ్లవర్ 9% తగ్గుముఖం పట్టాయి. అయితే ఆముదాల సాగు మాత్రం 30% మేర పెరగడం గమనార్హం. అదే సమయంలో చెరుకు సాగు వృద్ధి సాధించింది. గత ఏడాది 0.55 కోట్ల హెక్టార్లలో సాగగా, ఈ సీజన్‌లో అది 0.57 కోట్ల హెక్టార్లకు పెరిగింది.
ఖరీఫ్ 2025 గణాంకాలు మిశ్రమ సంకేతాలు ఇస్తున్నాయి. బియ్యం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడం దేశ ఆహార భద్రతకు సానుకూలంగా ఉన్నప్పటికీ సోయా, పత్తి సాగు విస్తీర్ణం తగ్గుదల దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వర్షపాతం, ప్రభుత్వ కొనుగోలు వ్యూహాలు, అంతర్జాతీయ మార్కెట్ ధరలు రైతుల భవిష్యత్ లాభనష్టాలను నిర్ణయించనున్నాయి.
సగటు సాగు 4.03కోట్ల హెక్టార్లు
ఈ దఫా 4.20కోట్ల హెక్టార్లలో వరి నాట్లు
గతేడాది కంటే 29.60లక్షల హెక్టార్లు అధికం
పప్పు ధాన్యాల సాగులో గణనీయ పెరుగుదల