చెక్‌బౌన్స్‌ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్‌ | BJP leader Suratani Sumathi arrested in cheque bounce case, Check details | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్‌

Apr 24 2026 9:05 AM | Updated on Apr 24 2026 9:09 AM

BJP leader Suratani Sumathi arrested in cheque bounce case, Check details

సాక్షి, అనంతపురం: చెక్‌బౌన్స్‌ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్‌ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ అనంతపురం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్‌ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌ 12న అనంతపురం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తాజాగా అరెస్ట్‌ తర్వాత రిమాండ్‌కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయ్యింది. 

‘వాల్మీకి’ నిధుల గోల్‌మాల్‌లో సుమతి పాత్ర!
కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్టు  ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. 

డొల్ల(షెల్‌) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement