పేద రైతు కుటుంబంపై బీజేపీ నేత గోపాల్‌ రెడ్డి దౌర్జన్యం 

BJP Leader Gopal Reddy Outrage On Poor Peasant Family - Sakshi

తాడిమర్రి: ఓ పేద రైతు కుటుంబంపై బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంగులకుంట గోపాల్‌రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బోరుబావిని తవ్వేందుకు యత్నిస్తున్న ఆయన.. అడ్డుకుంటే ప్రాణాలు తీయిస్తా అంటూ భయపెడుతున్నారు. చేసేది లేక ఆ రైతు కుటుంబం విలేకరులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన దేవర వెంకట్రాముడు, లక్ష్మీదేవి దంపతులకు తాడిమర్రి సర్వేనంబర్‌ 561లో 5.29 ఎకరాల పొలం ఉంది. బోర్లు వేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం 800 చీనీచెట్లు నాటుకున్నారు. వీరి పొలం పక్కనే బీజేపీ నాయకుడు గోపాల్‌ రెడ్డి భూమి ఉంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బోరు ఉంటే దానికి 200 అడుగుల దూరం పైన మరో బోరు వేయాల్సి ఉంటుంది. అయితే, గోపాల్‌ రెడ్డి 30 అడుగుల లోపు బోరు వేసుకునేందుకు కొన్ని రోజుల క్రితం యత్నించాడు. అక్కడ బోరు వేస్తే తమ బోరులో నీరు పోతాయంటూ వెంకట్రాముడు కుటుంబం అడ్డు చెప్పగా, గోపాల్‌ రెడ్డి వారిపై దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఆగక ఒక బోరులో రాళ్లు వేశాడు, మరో బోరు, మీటర్‌ పెట్టె ధ్వంసం చేశాడు. బోరు వేయకుండా అడ్డుకుంటే మీ ప్రాణాలు తీయిస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాధిత రైతులు ఆదివారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమకు గోపాల్‌ రెడ్డి నుంచి ప్రాణాపాయం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top