గర్భశోకం కలిగిన రోజే.. కవలల జననం

Birth Of Twins With IVF Andhra Pradesh - Sakshi

రెండేళ్ల క్రితం గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన దంపతులు

ఐవీఎఫ్‌ ద్వారా జన్మనిచ్చిన వైనం

దొండపర్తి (విశాఖ దక్షిణ): కాకతాళీయమో లేక ఆ దంపతులకు గర్భశోకాన్ని తొలగించేందుకు దేవుడిచ్చిన వరమో తెలియదు గానీ.. ఏ రోజున తమ బిడ్డల్ని కోల్పోయారో.. రెండేళ్ల తరువాత అదే రోజున కవలలు జన్మించారు. ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన రోజునే తిరిగి కుమార్తెలు పుట్టడంతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల ఆనందం అవధులు దాటింది. వివరాల్లోకి వెళితే.. 2019 సెప్టెంబర్‌ 15న ఆరిలోవలో నివాసముంటున్న తలారి అప్పలరాజు, భార్య భాగ్యలక్ష్మి, వారి కుమార్తెలు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (ఏడాదిన్నర)తో పాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి రాయల్‌ వశిష్ట బోటులో రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరారు. దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామానికి సమీపంలో బోటు గోదావరిలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందులో భార్యాభర్తలు అప్పలరాజు, భాగ్యలక్ష్మి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. వారి కుమార్తెలు వైష్ణవి, అనన్య, మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులు సైతం మరణించారు. దీంతో ఆ దంపతులు గర్భశోకంతో తల్లడిల్లిపోయారు.

జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని..
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించగా.. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పడంతో పద్మశ్రీ ఆస్పత్రిని సంప్రదించి పిల్లల కోసం ప్రయత్నించారు. ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రెండేళ్ల తరువాత సెప్టెంబర్‌ 15వ తేదీనే భాగ్యలక్ష్మి ఐవీఎఫ్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలలు కూడా కుమార్తెలే కావడంతో ఆ భార్యాభర్తల ఆనందం వెల్లివిరిసింది.

వైద్య చరిత్రలో అపురూప ఘట్టం 
గత ఏడాది అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు ఔట్‌పేషెంట్‌ క్లినిక్‌లో సంప్రదించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపి వైద్యం ప్రారంభించాం. అక్టోబర్‌ 20వ తేదీన ప్రసవం వస్తుందని అంచనా వేశాం. కానీ సెప్టెంబర్‌ 15వ తేదీనే భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో ఆలస్యం చేయకుండా శస్త్ర చికిత్స చేశాం. 1.9 కిలోలు, 1.65 కిలోలతో పిల్లలిద్దరూ ఆరోగ్యంగా జన్మించారు. వైద్య చరిత్రలో ఇది అపురూప ఘట్టంగా భావిస్తున్నా.    
– డాక్టర్‌ సుధా పద్మశ్రీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top