విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్‌

Biometric for student attendance in Andhra Pradesh - Sakshi

ప్రత్యేక యాప్‌ రూపొందించిన పాఠశాల విద్యా శాఖ

కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలన

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు

ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు

మెరుగైన ప్రమాణాల లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

జగనన్న అమ్మఒడి పథకానికి 75% హాజరు అనుసంధానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం మనబడి – నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన పౌష్టికాహారం అందిస్తోంది. వీటన్నిటి అంతిమ లక్ష్యం.. విద్యాప్రమాణాల పెంపే. 

75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి
విద్యా ప్రమాణాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే విద్యార్థులు రోజూ పాఠశాలలకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు అమ్మఒడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బయోమెట్రిక్‌ హాజరు యాప్‌ను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 

82 లక్షల మంది విద్యార్థులు
రాష్ట్రంలో 61 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 6.49 లక్షల మంది, రెండో తరగతిలో 58 వేలకుపైగా చేరారు. వీరిలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరడం గమనార్హం. మొత్తం మీద ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 6.5 లక్షల మంది వరకు విద్యార్థులు అదనంగా చేరారు. వీరు క్రమబద్ధంగా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. 

బయోమెట్రిక్‌ వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ
బయోమెట్రిక్‌ హాజరుపెట్టడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లారో, లేదో తెలుస్తుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టడం మంచి పరిణామం.
– గట్టెం అశోక్‌ కుమార్, విద్యార్థి తండ్రి, పెదపాడు, పశ్చిమ గోదావరి

డ్రాపవుట్లు తగ్గుతాయి
బయోమెట్రిక్‌ హాజరుతో డ్రాపవుట్లు తగ్గుతాయి. పాఠశాలకు ఎవరు రాలేదో వెంటనే తెలుస్తుంది. తద్వారా వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఖచ్చితమైన హాజరు తెలియడంతో మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకత ఏర్పడుతుంది. 
– తోట ప్రసాద్, ఉపాధ్యాయుడు,మండల ప్రాథమిక పాఠశాల, పెదపాడు, పశ్చిమ గోదావరి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top