ఎర్రగుంట్లలో వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై దాడి చేస్తున్న టీడీపీ, కూటమి గుండాలు
మూడోరోజూ అరాచకపర్వం
పులివెందుల వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసుల అమానుషత్వం
పార్టీ ఆఫీసు నుంచి బయటికి వస్తే కేసులు పెడతామని హెచ్చరిక
ఎర్రగుంట్లలో మహిళలపై కూటమి నేతల విచక్షణారహిత దాడులు
నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డుకున్న ఖాకీలు
జమ్మలమడుగు చైర్మన్ అభ్యర్థి ఇందిర నామినేషన్ దాఖలును అడ్డుకున్న పోలీసులు
కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, పుంగనూరు, మైదుకూరులోనూ అదే దుస్థితి
హైకోర్టు ఉత్తర్వులూ అమలుచేయని జిల్లా అధికార యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి సర్కారు అరాచకపర్వం మూడోరోజూ కొనసాగింది. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ గూండాలు భౌతిక దాడులతో భీతావహ వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం నేతలు ‘దుశ్శాసన పర్వానికి’ తెరలేపారు. పచ్చోసిన ఖాకీలు పులివెందుల వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచెలు వేసి నాయకులను బయటకు రాకుండా కట్టడి చేశారు. నామినేషన్లు వేయకుండా హౌస్ అరెస్టులకు తెగబడ్డారు. చైర్‌పర్సన్ అభ్యర్థులనూ అనుమతించలేదు.
తమ సమక్షంలోనే మహిళలపైనా పచ్చగూండాలు దాడులకు పాల్పతున్నా పోలీసులు నిలువరించలేదు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా ఖాకీలే అడ్డుకోవడం గమనార్హం. పట్టపగలే ఇంతటి దౌర్జన్యకాండ సాగుతున్నా.. ఎన్నికల అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. జమ్మలమడుగు చైర్‌పర్సన్ అభ్యర్థి పొన్నపురెడ్డి ఇందిర నామినేషన్ వేయకుండా గుండ్లకుంటలోని ఆమె స్వగృహంలోనే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవే పరిస్థితులు ఎర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లోనూ చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారింది. మరోవైపు టీడీపీ గూండాల అరాచకాలకు పచ్చఖాకీలు నిస్సిగ్గుగా సహకరించారు.
కొండాపురం నుంచి పులివెందులకు దాదాపు 40 కార్లలో టీడీపీ గూండాలు తరలివచ్చినా అడ్డుకున్న పాపానపోలేదు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా చుట్టపక్కల ప్రాంతాల్లో సైతం వైఎస్సార్‌సీపీ నేతల్ని కట్టడి చేశారు. మండల కేంద్రాల్లో వేకువజామున్నే పోలీసుస్టేషన్లకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఎర్రగుంట్లలో నామినేషన్ వేయకుండా తుంగా వెంకటరావిురెడ్డిని ఉదయాన్నే సీఐ విశ్వనాథరెడ్డి ముద్దనూరుకు తీసుకెళ్లి నిర్బంధించారు. బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతల్ని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్బంధించారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మంత్రి అంజద్‌బాషా, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు చైర్మన్ అభ్యర్థి నరసింహారెడ్డిని వారి ఇళ్లలోనే హౌస్ అరెస్టు చేశారు.
హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతర్...
హైకోర్టు ఉత్తర్వులనూ పోలీసులు బేఖాతర్ చేశారు. నామినేషన్లు వేసేందుకు రక్షణ కల్పించాల్సిందిగా కడపకు చెందిన 18 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు ఆయా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిందిగా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఆ మేరకు అదే విషయాన్ని మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ భవాని, డీఆర్వో మల్లికార్జునను కలిసి హైకోర్టు ఉత్తర్వులతోపాటు విజ్ఞాపన పత్రం అందజేశారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు కోసం రక్షణ కల్పించాలని కోరినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా మిన్నకుండిపోయింది. నామినేషన్లు గడువు ముగిసే వరకూ హైకోర్టు ఆదేశాలనూ ఖాకీలు పెడచెవిన పెట్టడం గమనార్హం.
ఎర్రగుంట్లలో దౌర్జన్యకాండ
ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి వెళ్లిన చంద్రకళ అనే యువతిపై కూటమి రౌడీలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌కు వెళ్తున్న మహిళలపై కర్రలు, రాళ్లు, చెప్పులతో దాడికి తెగబడ్డారు. దీంతో టీడీపీ గూండాలపై మహిళలు తిరగబడ్డారు. సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. అధికారపారీ్టకి అంత సత్తా ఉంటే తమతో నామినేషన్లు వేయించి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యక్షమైన కంకర రాళ్లు
నామినేషన్ల చివర రోజున కుతంత్రాలకు టీడీపీ మరింత పదునుపెట్టింది. దాడులకు వ్యూహం పన్నింది. కడప, రాజంపేటలో నామినేషన్ల కేంద్రాల వద్ద కంకర రాళ్లను టీడీపీ గూండాలు ముందే సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ కేంద్రాల సమీపంలో కంకర కుప్పలున్న విషయం ఫొటోలతో సహా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కడప గాంధీనగర్ స్కూల్ వద్ద యంత్రాలతో తొలగించారు. రాజంపేటలో తొలగించే యత్నం చేస్తుంటే టీడీపీ ఇన్‌చార్జి జగన్‌మోహన్‌రాజు కంకర కుప్పులు అలాగే ఉంచాలని హుకుం జారీ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు
పులివెందుల, కడపలో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, హత్యాయత్నాలకుకు పాల్పడ్డారనే తప్పుడు ఆరోపణలతో నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో సహా వందలాది మందిని కేసులలో ఇరికించే చర్యలకు ఉపక్రమించారు. ఇదే విషయమై పులివెందుల ప్రాంతానికి చెందిన టీడీపీ నేతతో ఓ పోలీసు అధికారి ఏకాంత చర్చలు జరిపి వైఎస్సార్‌సీపీ నేతల జాబితా తీసుకున్నట్లు సమాచారం. ఆ మేరకు అక్రమ కేసుల్లో నేతల పేర్లు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కేంద్రమైన కడపలో ఓ వాహనాన్ని దుండగులు కాల్చివేశారు. ఆ కేసులో నగరంలో క్రియాశీలక నేతలను చేరుస్తున్నట్లు పోలీసు వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి.


